పాల్వంచ: ఉద్యోగులు క్రీడలపై దృష్టి సారించాలని, తద్వారా శారీరక, మానసికోల్లాసం పొందవచ్చని కేటీపీఎస్ 7వ దశ సీఈ జె.సూర్యనారాయణ అన్నారు. 7వ దశ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న టీజీ జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్ వాలీబాల్, కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ 5,6,7 దశలు, బీటీపీఎస్, కేటీపీపీ, జూరాల, పోచంపల్లి పులిచింతల, విద్యుత్‌సౌదజట్లు హాజరయ్యాయి. సీఈ పోటీ లను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఎస్‌ఈలు ఎస్.యుగపతి, జి.శ్రీనివాస్, జి. రాజ్‌కుమార్, డివైసీసీఎ నాగరాజు, స్పోర్ట్స్ డిప్యూటీ సెక్రటరీ లోహత్ ఆనంద్, కేటీపీఎస్ 5,6,7 దశల సెక్రటరీలు వీరస్వామి, మహేష్, పలువురు కోచ్‌లు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
జూలూరుపాడు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకా రాం రాథోడ్ అన్నారు. సోమవారం జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, కళాశాలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని రికార్డులను పరి శీలించారు. వార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ సుందర్, హెచ్‌ఎస్ రత్నకుమార్, హెచ్‌వీ రాధిక, కేజీబీవీ ఎస్‌ఓ పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రత పాటించాలి
డీఈఓ నాగలక్ష్మి
చండ్రుగొండ: వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.నాగలక్ష్మి సూచించారు. చండ్రుగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. వంటశాలలను, పరిసరాలను, తరగతి గదులను, విశ్రాంతి గదులతోపాటు మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని గంగారం గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎటపాక మండలం గట్టుగూడేనికి చెందిన పద్దం సాయిరాం (26) భార్య సంధ్యతో కలిసి పౌలూరిపేటలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం తిరిగి బైక్‌పై వెళ్తుండగా గంగారం గ్రామంలో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రమాదంలో సంధ్యకు కూడా గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందజేశారు.
రఘునాథపాలెంలో యువకుడు..
రఘునాథపాలెం: రఘునాథపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రఘునాథపాలెంకు చెందిన బి.ఉపేందర్ (21) ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై సెంటర్‌లోని ఆటోస్టాండ్ నుంచి ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపైకి వస్తుండగా చెరువుగట్టు వద్ద డివైడర్‌ను ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉపేందర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి సోదరుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
పశువులు స్వాధీనం
కరకగూడెం: అక్రమంగా తరలిస్తున్న పశువులను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కరకగూడెంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు పశువులను స్వాధీనం చేసుకుని పాల్వంచలోని గోశాలకు తరలించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పీవీఎన్ రావు తెలిపారు.


