బాలుడి మృతితో విషాదం | - | Sakshi
Sakshi News home page

బాలుడి మృతితో విషాదం

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

అశ్వాపురం: మండలపరిధిలోని మామిళ్లవాయి గ్రామంలో మాజీ ఎంపీటీపీ బొర్రా శ్రీను కుమారుడు బాలుడు బొర్రా రాహుల్‌(17) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్‌ చదువుతున్న రాహుల్‌ సెలవులు కావడంతో ఇల్లెందులోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఆదివారం బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి కింద పడి తలకు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

హత్య కేసులో యావజ్జీవ శిక్ష

మహబూబాబాద్‌ రూరల్‌: కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.వేయి జరిమానా విధిస్తూ మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం(భద్రాచలం రోడ్‌) రైల్వేస్టేషన్‌లో 2023 ఏప్రిల్‌ 8న కూలీ లైన్‌ ప్రాంతానికి రావి మన్మథరావు బెంచీపై కూర్చోగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యోగేశ్‌ రావడంతో సీటు విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమాన యోగేశ్‌ కుర్చీకి ఉన్న ఇనుప పట్టీ తీసి దాడి చేయడంతో తీవ్ర గాయాలపై మన్మథరావు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేసిన డోర్నకల్‌ జీఆర్పీ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఇన్‌చార్జ్‌ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించారు.

తిప్పనపల్లిలో వరుస చోరీలు

చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో వరుస చోరీలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి కందిమళ్ల శ్రీను అనే రైతు ఫామ్‌లో రూ. 2.50 లక్షలు విలువైన నాటు కోళ్లను అపహరించారు. ఫారం ఇనుప గేటు, గ్రిల్స్‌ను కత్తిరించి చోరీ చేశారు. రెండు వారాల క్రితం ఇద్దరు రైతుల నాటుకోళ్లను అపహరించారు. రెండు నెలల క్రితం కూడా కొందరు ఇళ్లలోని నాటుకోళ్లను చోరీ చేసిన దుండగులు మసీదు ప్రాంగణంలోని మరుగుదొడ్లల్లో దాచారు. వాహనంలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు మేల్కోవడంతో పరారయ్యారు. తాజాగా జరిగిన చోరీ ఘటనలో బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement