గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై టోల్‌ వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై టోల్‌ వసూళ్లు

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

నేటి నుంచి బైక్‌లు, ఆటోల నిషేధం

వైరా: ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై టోల్‌ వసూళ్లు సోమవారం అధికారికంగా మొదలయ్యాయి. అయితే, ఖమ్మంలోని మున్నేటిపై బ్రిడ్జి, ధంసలాపురం వద్ద ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణాలు తప్ప మిగతా హైవే పనులు పూర్తయ్యాయి. దీంతో వైరా మండలంలోని సోమవరం వద్ద ఎగ్జిట్‌, ఎంట్రీ పాయింట్‌ నుంచి వాహనాలకు రాకపోకలకు కొద్దిరోజులుగా అనుమతిస్తున్నారు. ఈనేపథ్యాన సోమవరంలోని టోల్‌ పాయింట్‌ వద్ద వసూళ్లను ఎన్‌హెచ్‌ఏఐ పీడీ దివ్య సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఇకపై అధికారికంగా టోల్‌ వసూళ్లు మొదలుకానున్నాయని తెలిపారు. అంతేకాక హైవేపై ద్విచక్రవాహనాలు, ఆటోల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నందున వాహనారులు గమనించాలని సూచించారు.

ఏడు టోల్‌ బూత్‌లకు అనుమతి

ఖమ్మం – దేవరపల్లి హైవే నిర్మాణాన్ని 120 కి.మీ. నిడివితో చేపట్టారు. ప్రస్తుతానికి ఖమ్మంలో పనులు పూర్తికాకపోవడంతో వైరా మండలం సోమవరం నుంచి చివరి పాయింట్‌ వరకు 60 కి.మీ. హైవేపై ప్రయాణానికి అనుమతిస్తున్నారు. హైవేపై జిల్లా పరిధిలోని పది ఎగ్జిట్‌, ఎంట్రీ పాయింట్లకు గాను, తల్లంపాడు, కోదాడ క్రాస్‌, ధంసలాపురం మినహా సోమవరం సహా ఏడు చోట్ల అనుమతి ఉంది. దీంతో వాహనదారులు ఆయా పాయింట్ల వద్ద హైవేపైకి ప్రవేశించి రాకపోకలు సాగించే వెసులుబాటు లభించింది. కాగా, హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌(ఓఆర్‌ఆర్‌) రోడ్డు మాదిరిగా హైవేపైకి చేరుకునే పాయింట్‌ నుంచి దిగే పాయింట్‌ వరకే కి.మీ. లెక్కించి టోల్‌ వసూలు చేసేలా బూత్‌లను ఏర్పాటుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement