జై శ్రీరామ్.. జై హనుమాన్..
● కాలినడకన భద్రాచలం వస్తున్న హనుమాన్ మాలధారులు ● మరో ఇరవై రోజులపాటు కొనసాగనున్న యాత్రలు ● జిల్లా వ్యాప్తంగా కనీస అతిథి మర్యాదలు కరువు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాలినడకన భద్రాచల రాముడి దర్శనం కోసం వెళ్లే హనుమాన్ మాలధారులతో జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ వర్ణం సంతరించుకుంటున్నాయి. మండే ఎండలో గాయపడిన పాదాలతో నడుస్తూ వెళ్తున్న భక్తులకు జిల్లాలో కనీస అతిథి మర్యాదలు కరువయ్యాయి. ఆఖరికి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ కార్యనిర్వాహక వ్యవస్థ సైతం మొక్కుబడి ఏర్పాట్లకే పరిమితమైంది.
కాలినడకన భద్రాచలం
హనుమాన్ మాలధారులు ఎక్కువ మంది కాలికనడకన వచ్చి భద్రాచల సీతారాములను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేసవి కావడంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రోడ్లపై పట్టుమని పది నిమి షాలు ఉంటేనే వడదెబ్బ తగిలే పరిస్థితులు ఉన్నా యి. అయినా భక్తులు మండే ఎండలకు వెరవకుండా కాలినడకన భద్రాచలం వస్తున్నారు. మాల ధరించిన వారు కాళ్లకు చెప్పులు వేసుకోరు. భగ్గుమంటున్న రోడ్లపైనే నడుస్తుండటంతో కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. గాయాలు కావడంతో పాదాలకు రెండు, మూడు జతల సాక్సులు ధరించి పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
పట్టించుకోని దేవాదాయశాఖ
ఒక్క హనుమాన్ జయంతి అనే కాదు ముక్కోటి, నవమి, గోటి తలంబ్రాల తయారీ ఇలా అనేక పర్వదినాలకు భద్రాచలానికి పాదయాత్రగా వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. ఇలా వచ్చే భక్తులకు దారి పొడవున కనీస ఏర్పాట్లు కల్పించే విషయంలో ఇటూ దేవాదాయశాఖ, అటు భద్రాచలం ఆలయం నుంచి కనీస స్పందన కరువైంది. మహిళా భక్తుల కోసమైనా దారి వెంబడి కనీస ఏర్పాట్లు చేయడం లేదు.
వివిధ సంస్థల సహకారం తీసుకుంటే..
గడిచిన దశాబ్దం కాలంగా ప్రతీ పర్వదినానికి అన్నదానం చేయడం సర్వసాధారణంగా మారింది. కాలనీ అసోసియేషన్లు, వివిధ ఆర్గనైజేషన్లు ఈ పనిని స్వచ్ఛందంగా చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దారి పొడవున కల్యాణ మంటపాలు, ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. దేవాదాయశాఖ పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి. దేవాదాయశాఖ కానీ, భద్రాచలం ఆలయం కానీ ఒక్క పిలుపునిస్తే పాదయాత్రగా వచ్చే భక్తులకు అతిథి సేవలు చేసేందుకు ముందుకు వచ్చేసంస్థలు చాలా ఉన్నాయి. కానీ ఆ దిశగా చొరవ కరువైంది.
మాది కోదాడ. హనుమాన్ మాల ధరించిన ప్రతీ సారి భద్రాచలం కాలినడకన వస్తుంటాం. ఇది నాలుగోసారి. ఉదయం నాలుగు గంటలకే నడక మొదలు పెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తున్నాం. సాయంత్రం 4గంటలకు మళ్లీనడక మొదలు పెట్టి ఓపిక ఉన్నంత వరకు నడుస్తాం. సగటున రోజూ 40 కి.మీ ప్రయాణిస్తున్నాం. దారి మధ్యలో నీడ దొరికిన చోట సేద తీరుతున్నాం.
– శ్రీనివాస్, కోదాడ
హనుమాన్ మాల ధరించి భద్రాచలం చేరుకున్న భక్తులకు తానీషా మండపం, మారుతి సదనంలో వసతి కల్పిస్తున్నాం. పోకల దమ్మక్క నిత్యాన్నదాన సత్రంలో భోజనం అందుబాటులో ఉంటుంది.
– దామోదరరావు, భద్రాచలం రామాలయ ఈఓ
ఎన్నో ఏళ్లుగా కాలినకడన భద్రాచలం వచ్చే భక్తులు కొత్తగా వచ్చే వారికి సూచనలు చేస్తున్నారు. వాటిని అనుసరిస్తూ ఖమ్మం ––కొత్తగూడెం–భద్రాచలం, మహబూబాబాద్–ఇల్లెందు– పాల్వంచ –భద్రాచలం, పెనుబల్లి –కొత్తగూడెం – భద్రాచలం, అశ్వారావుపేట –దమ్మపేట/వేలేరుపాడు –భద్రాచలం మార్గాల్లో ఎక్కడెక్కడ నీడనిచ్చే పెద్దవైన చెట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ కనీస ఆశ్రయం ఇచ్చే ఆలయాలు ఉన్నాయనే వివరాలు తెలుసుకుని అక్కడ కొంత మేరకు సేద తీరుతున్నారు. మార్గమధ్యంలో ఏ హోటళ్ల దగ్గర తమకు ఆహారం లభిస్తుందో ముందుగానే తెలుసుకుని వారికి చెప్పి, తాము తాత్కాలిక విశ్రాంతి తీసుకునే చోటుకు ఆహారం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాసీనియర్ భక్తుల సూచనలు లేని కొత్త భక్తులైతే భద్రాచలం చేరుకునే లోపు ఎన్నో కష్టాలను జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాల నడుమ ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.


