బాధ్యతాయుతంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

● కలెక్టర్‌ అంకిత్‌ ● ప్రజావాణిలో వినతులు స్వీకరణ

● కలెక్టర్‌ అంకిత్‌ ● ప్రజావాణిలో వినతులు స్వీకరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారం విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్‌, విద్యాచందన, గృహ నిర్మాణశాఖ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రజావాణి వినతుల్లో కొన్ని ఇలా...

● తన కుమారుడికి గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని భద్రాచలానికి చెందిన జనగాం సుజల అనే మహిళ వినతిపత్రం ఇచ్చింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

● తన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ హక్కు పత్రంలో తన బదులు వేరే వ్యక్తి ఫొటో వచ్చిందని, మార్పు చేయాలని చర్ల మండలం ఆర్‌ కొత్తగూడెం గ్రామపంచాయతీకి చెందిన కొమరం భద్రయ్య ఫిర్యాదు చేశాడు.

● సర్వే నంబర్‌ 817/36లోని తమ భూమి భూభారతి ఆన్‌లైన్‌లో నిషేధిత జాబితాలో చూపిస్తోందని పాల్వంచకు చెందిన మంగళగిరి నాగమ్మ అనే మహిళ విన్నవించింది.

● జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామ శివారులో నివాసముంటున్న గుగులోత్‌ రాందాస్‌ తమకు ఉన్న పట్టా భూమిలో చేపల చెరువు నిర్మాణానికి మత్స్యశాఖ పథకం కింద ఆర్థికసాయం మంజూరు చేయాలని కోరారు.

నాణ్యమైన భోజనం అందించాలి

టేకులపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టర్‌ టేకులపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. వంటగదిని పరిశీలించి భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. త్రీఫేస్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించి, పాఠశాలలోని ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. మెనూ అమలుపై వివరాలు సేకరించారు. డైనింగ్‌ హాల్‌, ఆహార పదార్థాలను పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌లో కూరగాయలు నేలపై ఉంచగా, గమనించి వార్డెన్‌ను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్య మైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్‌, తహసీల్దార్‌ వీరభద్రం, గురుకులం ప్రిన్సిపాల్‌ రవీంద్ర, ఏకలవ్య ప్రిన్సిపాల్‌ కృష్ణ, ఎంపీఓ గణేష్‌ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement