నేటితో ముగియనున్న గడువు | - | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న గడువు

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి ఆలయ పాలకవర్గ గడువు నేటి(మంగళవారం)తో ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాన్నే మరో ఏడాది కొనసాగిస్తారా? నూతన పాలకవర్గాన్ని నియమిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గ గడువు పొడిగిస్తే ప్రస్తుత చైర్మన్‌కు తిరిగి చైర్మన్‌ పదవి లభిస్తుందా? మార్పులు జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది ఏప్రిల్‌ 21న నియామకం

జిల్లాలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయం తర్వాత ఎక్కువ ఆదాయం పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయం నుంచే వస్తోంది. 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీఓ 66 ద్వారా 15మంది సభ్యులతో కూడిన జాబితా విడుదల చేసింది. అయితే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ కమిటీని రద్దు చేసి, మరో 15మంది సభ్యులతో కూడిన కొత్తా జాబితా ప్రకటించింది. గతేడాది ఏప్రిల్‌ 21న బాలినేని నాగేశ్వరరావు చైర్మన్‌గా మరో 14 మంది పాలకవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. వీరి పదవీకాలం ఈ నెల 21న ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరిగి నూతన పాలకమండలి నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తామని దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వీరస్వామి తెలిపారు. ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుత పాలకవర్గమే మరో ఏడాది పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు కమిటీ సభ్యులు ఈసారైన చైర్మన్‌ పదవి దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. కాగా ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక పాలకవర్గ చైర్మన్లుగా గంగిరెడ్డి సుందర్‌రెడ్డి, జీవీ భద్రం, కె.వెంకటేశ్వర్లు తదితరులు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఆలయ ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. పాలకవర్గం పదవీ కాలం మంగళవారంతో ముగుస్తున్నట్లు పాలకవర్గ కమిటీకి, ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు సర్క్యులర్‌ ద్వారా సమాచారం ఇచ్చామని తెలిపారు.

పెద్దమ్మతల్లి ఆలయానికి

కొత్త పాలకవర్గాన్ని నియమిస్తారా..?

Advertisement
 
Advertisement
Advertisement