● మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● ఉద్యాన హబ్‌గా అభివృద్ధికి అవకాశం
అశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రత్యేకతల జాబి తాలోకి మరో విద్యాసంస్థ చేరింది. రాష్ట్రంలో మరో ఉద్యాన కళాశాలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వంనిర్ణయం తీసుకోగా, ఇందుకు అశ్వారావుపేటను ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రాజేంద్రనగర్, సిద్దిపేట జిల్లా ములుగు, వనపర్తి జిల్లా మోజెర్లలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉధ్యాన యూనివర్సిటీ అనుబంధ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. కొత్తగా అశ్వారావుపేటలో కూడా మరో కళాశాల ఏర్పాటు చేయనున్నారు. గత శనివా రం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన యూ నివర్సిటీ వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డిలతో సమావేశమై వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలి ఏడాది 30 సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.
160 సీట్లతో వ్యవసాయ కళాశాల
ఇప్పటికే అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను 160 సీట్లతో నిర్వహిస్తున్నారు. విశాల మైదానం, అధ్యయనానికి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల బ్లాక్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 1989లో వ్యవసాయ కళాశాల ప్రారంభంకాగా, రైతులకు వ్యవసాయ సలహా కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రొఫెసర్ల సలహాలతో మెట్ట పంటలు, మా మిడి, జీడి తోటల నుంచి క్యారట్, కాప్సికం, అల్లం, బ్రకోలి, డ్రాగన్ ఫ్రూట్, కోకో, వక్క, దాల్చిన చెక్క, లవంగాలు వంటి అరుదైన పంటలు సాగు చేసేలా ఇక్కడి రైతులు మార్పు చెందారు.
2005లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని
ప్రారంభించిన వైఎస్సార్..
2005లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమంగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో 2లక్షల హెక్టార్లకు విస్తరించింది. అనంతరం దమ్మపేటలో మరో ఫ్యాక్టరీ ఏర్పా టు చేశారు. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం, అచ్యుతాపురం మామిడి విత్తనోత్పత్తి క్షేత్రం తోడ్పాటుతో పదుల సంఖ్యలో ప్రైవేటు నర్సరీలు నిర్వహిస్తూ రూ.కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన ఉద్యాన మొక్కలకు కేరాఫ్ అడ్రస్‌గా అశ్వారావుపేట చరిత్రకెక్కింది. కొత్తగూడెం, వైరా కృషి విజ్ఞాన కేంద్రాలు, పొరుగు రాష్ట్రంలో 80 కిలోమీటర్ల దూరంలోని తాడేపల్లి గూడెం వద్ద డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన యూనివర్సిటీ, పెదవేగిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ స్టేషన్, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్లు విద్యార్థులకు ప్రాక్టికల్ విద్యకు దోహదపడే అవకాశం ఉంది.


