కల్లాల్లోనే పాలిపోతోంది..
ప్రభుత్వపరంగా అరకొరగానే
కేంద్రాలు.. ఆపై కొర్రీలు
అన్నీ భరించినా కొనుగోళ్లలో జాప్యం
ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తే
ధరలో కోత
మార్క్‌ఫెడ్‌తో మరో గోస
మక్క రైతు..
ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇటీవల వర్షాలతో పంట కొంత దెబ్బతింది. అయినా ప్రభుత్వం ధర రూ.2,400 వస్తుందని సంతోషపడితే కేంద్రం ఏర్పాటు కాలేదు. బయట వ్యాపారులకు రూ.1,600, రూ.1,700కు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. అధికారులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నా.
– అరెం నరసింహారావు, గుండాల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం పంట అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరవక, తెరిచిన చోట కొనుగోళ్లు జరగక పడిగాపులు కాస్తున్నారు. అవసరమైన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటుచేయడం, కొనుగోలు చేసిన చోట లారీలు సమకూర్చకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇదేఅదునుగా ప్రైవేట్ వ్యాపారులు ధరలో కోత విధించి దోచుకుంటుండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.
సంతోషం లేదు..
వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండటంతో ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెంలో 73 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. సాగు సమయాన రైతుల్లో ఆనందం వ్యక్తమైనా కొనుగోళ్ల వరకొచ్చే సరికి నిరాశే ఎదురవుతోంది.
బహిరంగ దోపిడీ
మొక్కజొన్న కోతలు పూర్తయి పంట ఇంటికి వచ్చే సమయానికి ధర గిట్టుబాటు కాకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా, బహిరంగ మార్కెట్‌లో నాణ్యత సాకుతో రూ.1,800 నుండి రూ.2వేల మధ్యే వ్యాపారులు కొనుగోలు సాగిస్తున్నారు. తద్వారా క్వింటాకు దాదాపు రూ.400 నుండి రూ.600 వరకు నష్టం జరుగుతోంది. ఈ కారణంగా పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆందోళన బాట
మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో ఆలస్యంతో రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బస్తాలు లేకపోవడం, బస్తాలు ఉన్న చోట్ల కాంటా పూర్తయినా లారీలు రాకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ఈ కారణంగానే కొణిజర్లలో రైతులు శనివారం రాస్తారోకో చేపట్టారు. అలాగే, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోనకు దిగారు. అసలే అరకొరగా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అవి కూడా అవసరమైన చోట ఏర్పాటుచేయలేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గుండాల మండల వ్యాప్తంగా సుమారు 20వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగైంది. ఖరీఫ్‌లో పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేసిన అధికారులు ఈసారి ఇప్పటివరకు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే వారంలోగా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కానీ తేమశాతం పూర్తిగా పోయి మొక్కజొన్న పంట కల్లాల్లోనే పాలిపోతోంది. దీంతో చేసేదేం లేక స్థానిక వ్యాపారులకు అమ్ముతున్న రైతులు క్వింటాపై రూ.500 మేర నష్టపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో సాగు
బహిరంగ మార్కెట్‌లో ధర లేకపోవడంతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యాన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈమేరకు ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినా అధికారుల నిర్లక్ష్యంతో ఫలితం దక్కడం లేదు. పంట సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ కేంద్రాలు ఏ మూలకు సరిపోవని చెబుతుండగా.. అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటుచేయలేదనే విమర్శలు వస్తున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని నిరాకరిస్తుండడంతో కేంద్రాల్లో పంట ఆరబోసి రైతులు ఎదురుచూస్తున్నారు. అంతేకాక ఆన్‌లైన్ ఎంట్రీలు, ఆధార్ లింకింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల తనిఖీ పేరుతో తిప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


