ఏజెన్సీలో తాగునీటి వెతలు | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో తాగునీటి వెతలు

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

రెండు, మూడు కిలోమీటర్లు వెళ్తేనే తాగునీరు

అటవీప్రాంతంలోని చెలిమలు, వాగుల నీరే దిక్కు

గొంతెండుతున్న ఆదివాసీ

గిరిజనులు

పాల్వంచరూరల్‌: ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న ఒకటి, రెండు చేతిపంపులు కూడా పనిచేయడం లేదు. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే మే లో ఎలా ఉంటుందోనని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

ఆదివాసీ గూడేల్లో తీవ్ర నీటిఎద్దడి

అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఆదివాసీలను తాగునీటి ఎద్దడి మరింత త్రీవంగా వెంటాడుతోంది. తాగునీటి కోసం కిలోమీటరు దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. అయినా కలుషితమైన చెలిమ నీరే లభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతమైన పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీ, బంజర, రేగులగూడెం పంచాయతీల పరిధిలోని చిరుతానిపాడు, రాళ్లచెలక, బూసురాయి, పెద్దకలశ గ్రామాల్లో తాగునీరు దొరకడం లేదు. సుమారు 120మందికి పైగా ఆదివాసీ గిరిజనులు నివాసం ఉంటున్న పెద్దకలశలో ఒకే ఒక్క బోరు ఉంది. ఆ బోరు నీరు గ్రామస్తులకు సరిపోవడంలేదు. దీంతో కిలోమీటర్‌ దూరంలో ఉన్న వాగు నీటిని తెచ్చుకుంటున్నారు. చిరుతానిపాడు గ్రామంలో గతేడాది ఒక చేతి పంపు ఏర్పాటు చేసినా ప్రస్తుతం నీళ్లు సక్రమంగా రావడంలేదు. రాళ్లచెలక, బూసురాయి గ్రామాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. కావడ్లు, బిందెలు, బుర్రలతో సుదూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఎండలకు చెలిమల్లో కూడా ఊట సక్రమంగా రావడంలేదని ఆదివాసీలు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement