పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ, ఆలయ కమిటీ సభ్యులతోపాటు అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని, ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయం వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 256 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌కు రూ.13,665 ఆదాయం లభించింది. 135 మంది బోటింగ్ చేయగా రూ.8,140 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్‌ల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు కొత్తగూడెం నగరంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేయగా, పదో తరగతి అభ్యర్థులు 1,045 మంది, ఇంటర్ అభ్యర్థులు 1,196 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. నిర్వహణకు 10 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 140 మంది ఇన్విజిలేటర్లు, 10 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి లేదని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అనుమతి ఉండదని, అభ్యర్థులు హాల్ టికెట్ తెచ్చుకోవాలని సూచించారు.
సీఈఓల్లో ప్రవేశపరీక్షకు 88.59శాతం హాజరు
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ గిరిజన గురుకుల(సీఓఈ) కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుచేసిన ఐదు పరీక్ష కేంద్రాలను ఆర్‌సీఓ, పరీక్షల పరిశీలకురాలు అరుణకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న 1,692 మంది విద్యార్థులకు గాను 1,468 మంది(88.59 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో 1,035 మంది, బైపీసీ విభాగంలో 796 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.


