ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యాన ఈ నెల 20 నుంచి వరంగల్‌లో జరగనున్న సమ్మర్ క్రికెట్ లీగ్ టోర్నీకి ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ ఆదివారం జెర్సీలను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఖమ్మం లయన్స్ పేరిట ఒక జట్టును ఎంపిక చేశామని తెలిపారు. జట్టు కెప్టెన్‌గా ఇమ్రాన్ (ఖమ్మం) వ్యవహరించనుండగా, ఎం.పవన్, సూర్య, కరుణాకర్, వరప్రసాద్, ఆర్యన్, రిత్విక్, రుషికుష్, జీవన్, ఉజ్వల్ ఎంపికయ్యారని చెప్పారు. కోచ్‌గా జి.వీరేశ్, అసిస్టెంట్ కోచ్‌గా సుధాకర్, మేనేజర్‌గా జకీర్ వ్యవహరిస్తారని తెలిపారు.
చిన్నారికి
ప్రాణం పోసిన వైద్యులు
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా వైద్యశాలలో ఓ శిశువును వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించారు.ఆదివారం గుండాలమండలం నాగా రం గ్రామానికి చెందిన నవీన్ తన మూడు నెలల శిశువు అభినేహాన్‌ను హృదయ స్పందన సరిగ్గా లేని స్థితిలో ఇల్లెందు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు భగత్‌సింగ్ తన బృందంతో అత్యవసర చికిత్స అందించి, తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. అలాగే, అంబులెన్స్‌లో చిన్నారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ఖమ్మం తరలించారు.వైద్యుడు భగత్‌సింగ్, వైద్య బృందానికి చిన్నారి కుటుంబ సభ్యు లు కృతజ్ఞతలు తెలిపారు. వారిని డీసీహెచ్‌ఎస్ జి.రవిబాబు, వైద్యశాల సూపరింటెండెంట్ జి.హర్షవర్దన్ సైతం అభినందించారు.
మే 3వ తేదీ వరకు
రైల్వేగేట్ మూసివేత
కారేపల్లి: కారేపల్లి – ఇల్లెందు రైల్వేలైన్ పరిధి లోని సూర్యతండా – అప్పాయిగూడెం మధ్య ఉన్న గేట్‌ను మే 3వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గేటు వద్ద ట్రాక్, రోడ్డు మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సూర్యతండా, చండ్రళగూడెం గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇల్లెందు వెళ్లేందుకు కారేపల్లి మీదుగా దారి మళ్లించాలని రెవెన్యూ అధికారులకు రైల్వే అధికారులు లేఖ అందజేశారు.
నటుడు ప్రకాష్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు
భద్రాచలంటౌన్: శ్రీ రాముడిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారంటూ సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై ఆదివారం భద్రాచలం పోలీసుస్టేషన్‌లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్రఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుంజా ధర్మారావు ఆధ్వర్యాన నాయకులు పోలీసులకు ఫిర్యాదుపత్రం అందజేశారు. ఇటీవల ఓ వేదికపై మా ట్లాడిన రామాయణంపై ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని కోరా రు. బీజేపీ నాయకులు కుంజా సంతోష్, ముత్యాల శ్రీనివాస్, నాగబాబు, రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో
వృద్ధురాలు మృతి
దమ్మపేట: మండలంలోని వడ్లగూడెం గ్రామంలో వడదెబ్బ కారణంగా వృద్ధురాలు మృతి చెందిందని, ఆమె బంధువులు తెలిపారు. గ్రామానికి చెందిన వల్లెపు వెంకటలక్ష్మి (60) శనివారం దైవ దర్శనం కోసం భద్రాచలం వెళ్లి అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.


