విద్యార్థి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతదేహం లభ్యం

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

మణుగూరుటౌన్‌: మండలంలోని రేగులగండి చెరువులో శనివారం మధ్యాహ్నం గల్లంతైన విద్యార్థి నక్కా హర్షవర్దన్‌ (14) మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. మణుగూరు సీఐ నాగ బాబు, తహసీల్దార్‌ అద్దంకి నరేశ్‌ పర్యవేక్షణలో ఫైర్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా పడిఉన్న కుమారుడిని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కాగా, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బాబు మృత్యువాత పడ్డాడని, ఒక్కపూట బడుల నేపథ్యంలో బాబు ఇంటికి రాకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఫోన్‌ చేసినా యాజమాన్యం స్పందించలేదని మృతుడి తల్లి ఆరోపించారు. ఈ విషయమై విజ్ఞాన పాఠశాల కరస్పాండెంట్‌ సాంబశివారెడ్డిని వివర ణ కోరగా.. ఒక్కపూట బడుల నేపథ్యంలో విద్యార్థులను మధ్యాహ్నమే వారి ఇళ్లకు బస్సుల్లో పంపించేశామని, అందుకు సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులకు అందించామని తెలిపారు. కాగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నాగబాబు తెలిపారు.

రోడ్డుప్రమాదంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మృతి

ఎర్రుపాలెం: సైకిల్‌ రిక్షా, బైక్‌ ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన మండలంలోని బనిగండ్లపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం రోడ్డులో సైకిల్‌ రిక్షా నడుపుతూ బలుసుపాటి ఆనందరావు బనిగండ్లపాడు గ్రామం వైపు వస్తున్నాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి నండ్రు సుధాకర్‌ (48) బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఢీకొన్నారు. ఘటనలో రిక్షాపై ఉన్న చెక్క మొద్దు సుధాకర్‌ను బలంగా తాకడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలంలో పరిశీలన అనంతరం కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేశ్‌కుమార్‌ తెలిపారు.

తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు ..

ఖమ్మంరూరల్‌: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిన గీతకార్మికుడు మృతి చెందాడు. మండలంలోని చింతపల్లికి చెందిన ఎనిగళ్ల వీరభద్రం (48) ఆదివారం రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా మోకు జారడంతో కింద పడ్డాడు. దీంతో సమీపంలో ఉన్న వారు వచ్చిచూసే సరికి ఆయన తీవ్ర గాయాలై మృతి చెందాడు. వీరభద్రంకు భార్య, కూతురు, కుమారుడు ఉండగా, కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement