50 ఆకుల కట్టకు
రూ.3.42గా ఖరారు
రేటు పెంచిన ప్రభుత్వం, కాంట్రాకర్లు
కొత్తగూడెం డివిజన్‌లో ధర అమలు
గుండాల: గిరిజనుల వేసవి పంట తునికాకు సేకరణకు సమయం ఆసన్నమైంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ. 3.31 పైసలు ఉండగా, ఈ ఏడాది రూ.3.42 పైసలుగా ధర నిర్ణయించారు. మండలంలోని చెట్టుపల్లి గ్రామంలో శనివారం తునికాకు రేటుపై కార్మికులు, తునికాకు పోరాట కమిటీ, కాంట్రాక్టర్ల మధ్య చర్చలు జరిగాయి. గతేడాది ప్రభుత్వం ధర రూ.3.30 ఉండగా, ఈ ఏడా ది 10 పైసలు పెంచి రూ. 3.40 ధర నిర్ణయించింది. కాంట్రాక్టర్లు మరో 5 పైసలు పెంచా లని పోరాట కమిటీ డిమాండ్ చేయగా, చర్చల అనంతరం 2 పైసలు పెంచారు. దీంతో 50 ఆకుల తునికాకు కట్టకు ధర రూ. 3.42గా నిర్ణయించారు.
మిగతా ధరలు కూడా...
గతంలో కల్లేదార్ల కమీషన్, హ్యాండ్లింగ్ చార్జీలను 10శాతం పెంచారు. కల్లేదార్ల కమీషన్ రూ. 190.05, ఉల్టా, పల్టా కుచ్చాలకు రూ. 96.62, భర్తీకి రూ. 115.95గా ధర నిర్ణయించారు. తునికా కు సేకరణ సమయంలో ప్రమాదానికి గురైతే సంబంధిత కాంట్రాక్టర్లు ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం పట్టణానికి తరలించేందుకు వాహన సౌకర్యం కల్పించాలని, బీమా వర్తింపచేయాలని నాయకులు కాంట్రాక్టర్లను కోరారు. ఈ నిబంధనలు కొత్తగూడెం డివిజన్ పరిధిలోని గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, పినపాక, బూర్గంపాడు, కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, అన్నపురెడ్డి పల్లి, పాల్వంచ, చండ్రుగొండ, ఇల్లెందు, బయ్యారం, గంగారం, పాకా ల, గూడూరు, మహబూబాబాద్ మండలాల్లో అమలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపా రు. చర్చల్లో కాంట్రాక్టర్లు అబ్దుల్ రెహమాన్, అతహూల్ రెహమాన్, అజిజుల్ రెహమాన్, సుపుద్దీన్, సంపత్‌రెడ్డి, నాగరాజు, ముంతాజిమ్, సయ్యద్ అజ్జు, ఖుద్దూస్, తునికాకు పోరాట కమిటీ నాయకులు గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, ముక్తి సత్యం, మాచర్ల సత్యం, రేసు ఎల్లయ్య, రమేష్, కొమరం శాంతయ్య, బానోత్ ఊక్లా, గోవింద నర్సింహారావు, పూనెం శ్రీను, సైదులు, సాగర్, ఆశోక్, కిషన్, గోపన్న తదితరులు పాల్గొన్నారు.


