అశ్వాపురం: మండలపరిధిలోని నెల్లిపాక గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున మొండికుంట–భద్రాచలం రహదారి వెంట బైక్ చెట్టుకు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కొమరం మహేష్ (34) బంధువులు అనారోగ్యంతో భద్రాచలం ఆస్పత్రి లో ఉండగా చూడటానికి వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. నెల్లిపాక శివారులో మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందా డు. ఉదయం స్థానికులు ఆయనను గుర్తించి ఇచ్చిన సమాచారంతో సీఐ అశోక్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మల్లూరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
రేగులగండిలో విద్యార్థి గల్లంతు
మణుగూరుటౌన్: మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థి రేగులగండి చెరువులో గల్లంతైన ఘటన మణుగూరులో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుట్టమల్లారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు నక్కా హర్షవర్దన్, శశిధర్, గిరిధర్.. ఒక్కపూట బడులు కావడంతో మధ్యాహ్నం సమయంలో రేగులగండి చెరువు వద్దకు వెళ్లారు. లోపలికి దిగాక హర్షవర్దన్ గల్లంతయ్యాడన్నాడు. మిగిలిన విద్యార్థులు బాధిత కుటుంబ సభ్యులకు తెలపగా, వారు పోలీసులను సంప్రదించి జాలర్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థిది మున్సిపాలిటీలోని ఆదర్శ్‌నగర్ కాగా, ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఐ నాగబాబు సందర్శించారు.
మహిళ అదృశ్యంపై కేసు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణ పరిధిలోని మెడికల్కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి ఈ నెల 16వ తేదీన ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఆమె కుమారుడు గౌరీ శశాంక్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


