భద్రాచలంలో భక్తులకు
ఇక్కట్లు కలగకుండా చర్యలు..
అదే సమయంలో యుద్ధప్రాతిపదికన పనులు
నిర్మాణ పనులపై
మంత్రి పొంగులేటి సూచనలు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏడాది వరకే గడువు ఉండటంతో యుద్ధప్రాతిపదికన, నిత్యం భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దేవస్థానం అభివృద్ధిలో తొలి విడతే కీలకం కానుంది. రూ.75 కోట్లతో గోదావరి ఒడ్డున సుదర్శన చక్రం, రూ. 180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ. 96 కోట్లతో పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నారు. స్వామివారికి నిత్య ఆరాధన, నివేదనలతో అంతరంగిక పూజలు నిర్వహిస్తూనే మరోవైపు భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించాల్సి ఉంది. కాగా, పనులను ప్రారంభించాక భక్తులకు ఆర్జిత సేవలను నిలిపివేసి సాధారణ దర్శనాలను కల్పించే అవకాశం ఉంది.
పకడ్బందీ ప్రణాళిక..
మార్చి 2027 నాటికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2027 జూలై చివరి వారంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అప్పటిలోగా ఆలయ ప్రధాన పనులను పూర్తి చేయాల్సి ఉంది. జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ముక్కోటి, శ్రీరామనవమి ప్రధాన ఉత్సవాలు ఉన్నాయి. ఈ ఉత్సవాలకు సుమారు లక్ష వరకు భక్తులు తరలి వస్తారు. ప్రధాన ఆలయం మినహా ఇతర ప్రాంతాలన్నింటిలోను ఏడాదంతా పనులు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీ ప్రణాళికతో, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ఇది అధికారులకు కత్తి మీద సాము లాంటిదనే చెప్పవచ్చు.
ఇటీవల పర్యటించిన మంత్రి పొంగులేటి
ఇటీవల భద్రాచలంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారుల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల వేగవంతానికి సిబ్బందిని పెంచాలని, ప్రాకారాలు, ఫుట్‌పాత్‌లు, మాఢ వీధులు తదితర ప్రతిపాదిత నిర్మాణాలకు ఆన్ గ్రౌండ్ మార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాత నిర్మాణ శైలిని అనుకరిస్తూనే కొత్త సాంకేతికతను మిళితం చేస్తూ పనులు చేపట్టాలన్నారు. రామదాసు కాలం నాటి రాళ్లను తిరిగివినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తర భాగంలో రిటైనింగ్ గోడలకు సమస్యలు తలెత్తకుండా, పనులను చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పలుమార్లు పత్రికలలో కథనాలు వచ్చిన గోదావరి ఘాట్ నుంచి దేవస్థానం వరకు నేరుగా కనెక్టివిటీ విషయమై మంత్రి స్పందించారు. నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ఆదేశించారు. అయితే రోడ్డు నిర్మాణంతోపాటే తీగల వంతెన కూడా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
రామాలయ అభివృద్ధికి
పక్కా ప్రణాళిక ఆవశ్యం


