కార్మికుల అడ్డా 21 పిట్
ఒక్కొక్కటి తొలగిస్తూ..
కార్మికవాడలకు తాగునీరు,
విద్యుత్ సరఫరా నిలిపివేత
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకూ
మోకాలడ్డుతున్న యాజమాన్యం
సింగరేణి వైఖరితో తల్లడిల్లుతున్న
ఇల్లెందులోని 21 పిట్ బస్తీ
సింగరేణి యాజమాన్యం అవసరం తీరేవరకు ఒకలా, అవసరం తీరాక మరోలా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ప్రాణాలకు తెగించి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన సీనియర్ కార్మికుల కుటుంబాల క్షేమాన్ని విస్మరిస్తోంది. తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస అవసరాలకు కూడా కొర్రీలు పెడుతోంది. ఆఖరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికీ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల రక్షణకు ఇటీవల చట్టం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే సీనియర్ కార్మిక వాడల వెతలను పట్టించుకోవాలనే డిమాండ్ వస్తోంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
21 పిట్ గని సమీపంలో కార్మికులు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత గనికి సమీపంలోనే స్ట్రట్‌పిట్, 24, సెంచరీ ఇంక్లైన్ వంటి భూగర్భ గనులు, ఏరియా పరిధిలో జవహర్‌ఖని వంటి ఓపెన్‌కాస్ట్‌లు వచ్చాయి. మెజారిటీ కార్మికులు 21లోనే నివాసం ఉంటూ ఆయా గనుల్లో పని చేసేవారు. ఫలితంగా 1990వ దశకంలో రొంపేడు మేజర్ గ్రామపంచాయతీగా మారింది. ఆ తర్వాత విభజనలో కార్మికవాడలు ఉన్న ప్రాంతాలు శేషగిరి బస్తీ, విజయలక్ష్మినగర్, తిలక్‌నగర్ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
కార్మిక వాడల విషయంలో 2000 దశకం నుంచి సింగరేణి తీరులో మార్పు మొదలైంది. ఇల్లెందులో బొగ్గు గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ముందుగా కార్మిక వాడలకు ఉచిత కరెంటు సరఫరాను నిలిపేసింది. ఆ తర్వాత నీటి సరఫరా బాధ్యతల నుంచి తప్పుకుంది. చివరకు అంతర్గత రోడ్ల నిర్మాణాలకు మంగళం పలికింది. కాగా, జవహర్‌ఖని విస్తరణతో మళ్లీ మంచిరోజులు వస్తాయనే నమ్మకం కలిగింది. అయితే, ఆ ఆశలకు ఆదిలోనే సింగరేణి గండి కొడుతోంది.


