భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవానం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
కోటి రామస్వరూప్‌కు
ప్రధాన అర్చకుడిగా పదోన్నతి
దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కోటి రామస్వరూప్ రాఘవాచార్యులుకు ప్రధాన అర్చకుడిగా పదోన్నతిని కల్పించారు. ఈ మేరకు ఈఓ దామోదర్‌రావు ఉత్తర్వులు అందజేశారు. కాగా ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు నవమి ఉత్సవాల అనంతరం పదవీ విరమణ చేశారు. మరో ప్రధాన అర్చకుడిగా విజయరాఘవన్ విధులు నిర్వరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎండ నుంచి ఉపశమనానికి తివాచీలు
దేవస్థానంలో భక్తులు పాదరక్షలు లేకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో వేసవి ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో తివాచీలు ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఆలయంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.


