సూపర్‌బజార్(కొత్తగూడెం): నూతన కలెక్టర్‌గా అంకిత్ బాధ్యతలు స్వీకరించాక క్రమం తప్పకుండా ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్‌కు వివిధ పనుల కారణంగా ఒక్కోసారి కొంత ఆలస్యమైనా మిగతా అధికారులు ప్రజావాణిలో సమస్యల దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. అయితే అధికారులు సకాలంలో రావడంలేదు. కలెక్టర్ వచ్చారా? అని ఆరా తీసి ఆ తర్వాతే అధికారులు ప్రజావాణి హాలులోకి వస్తున్నారు. సోమవారం కూడా 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఆ సమయానికి సుమారు 10 మంది అధికారులు కూడా రాలేదు. ఎండాకాలం, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అనేక వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్‌కు చేరుకుని క్యూలైన్‌లో బారులుదీరారు. కానీ అధికారులు లేకపోవడంతో నిరీక్షించాల్సి వచ్చింది. ఆలస్యం కావడంతో వినతి పత్రాలు ఇచ్చాక తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డారు. ఇకనైనా అధికారులు సకాలంలో హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


