భరద్రాచలం, పేటలో స్థలం ఓకే
రాష్ట్ర విభజనకు ముందు 2013 ఏప్రిల్‌లో నియోజకవర్గానికో మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో స్టేడియానికి కనీసం ఐదెకరాల స్థలం ఉండాలని నిబంధనలు విధించారు. అందులో భాగంగా ప్రస్తుత జిల్లాకు ఐదు స్టేడియాలు మంజూరయ్యాయి. అయితే, బడ్జెట్ అనుమతులు తీసుకోకుండానే పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. దీంతో సకాలంలో అనుమతులు రాక నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు
నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ప్రకటన వెలువడి పన్నెండేళ్లు దాటినా కొత్తగూడెం మినహా ఎక్కడా స్టేడియాలు అందుబాటులోకి రాలేదు. ఇటీవల విడుదలైన కాగ్ నివేదిక సైతం స్టేడియం పనులు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పించింది. అయితే,
ఇప్పుడీ పరిస్థితిలో మార్పు వస్తోంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
పినపాకలో తొలగిన చిక్కులు
పినపాక నియోజకవర్గ మినీ స్టేడియాన్ని కరకగూడెంలో నిర్మిస్తున్నారు. నిధుల కొరత కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ..సాగుతూ ఉన్నాయి. ఇటీవల రూ.1.20 కోట్లు మంజూరుకాగా, ఇక పనులు ఊపందుకోనున్నాయి. 2013లో ఒక్కో స్టేడియానికి రూ.2.32 కోట్లు కేటాయించగా, మారిన పరిస్థితులు, క్రీడా వసతులు పెంపునకు ఉన్న డిమాండ్‌ను దృష్ట్యా కొత్తగా నిర్మించబోయే స్టేడియాలకు బడ్జెట్ పెంచే అవకాశం ఉంది. ఒక్కో స్టేడియానికి రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది.
ఇల్లెందులో ప్రారంభానికి సిద్ధం
ఇల్లెందులో సీఈఆర్ (సింగరేణి ఎంప్లాయీస్ రిక్రియేషన్) క్లబ్ సమీపంలో స్టేడియం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. నిధుల గ్రహణంతో తీవ్ర జాప్యం జరిగినా.. ఎట్టకేలకు పనులు తుది దశకు చేరుకున్నాయి. సివిల్ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, చెస్, క్యారమ్స్ వంటి గేమ్స్‌తోపాటు జిమ్ రూమ్ కూడా ఉంది. ఔట్‌డోర్ విభాగంలో వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ విత్ 18 ఫీట్స్ నెట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. మరో నెలరోజుల్లో ఈ స్టేడియం ప్రారంభానికి సిద్ధంకానుంది.
కొత్తగూడెం.. ఆర్చరీలో మేటి
కొత్తగూడెం నియోజకవర్గానికి మంజూరైన మినీ స్టేడియాన్ని పాల్వంచలో నిర్మించారు. ఇక్కడ ఆర్చరీలో ఉత్తమ శిక్షణ లభిస్తోంది. టేబుల్ టెన్నిస్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో క్రీడాకారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ప్రతిభ చాటుతున్నారని జిల్లా క్రీడాధికారి పరంధామరెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన సీఎం కప్ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చూపించారని పేర్కొన్నారు.
భద్రాచలానికి 2013లో స్టేడియం మంజూరుకాగా, ఆ తర్వాత ఏడాదికే రాష్ట్ర విభజన జరిగి పట్టణం మినహా మిగిలిన ప్రాంతమంతా ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో స్థల సమస్య కారణంగా పన్నెండేళ్లుగా మినీ స్టేడియం పనులు పట్టాలెక్కలేదు. తాజాగా ఐటీడీఏ ఆఫీస్ రోడ్డులో ఐదెకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. భూబదలాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఆరంభంలో ఎంపిక చేసిన స్థలం ఊరికి దూరంగా ఉండటంతో పనులు మొదలుపెట్టలేదు. ఈ లోగా ఆ స్థలాన్ని పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. తాజాగా జంగారెడ్డిగూడెం రోడ్డులో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు రాగానే భద్రాచలం, అశ్వారావుపేటలలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.


