భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజ లు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు.విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. వా రాంతపు సెలవు రోజులు కావడంతో స్వామి వారి ఆర్జితసేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వృద్ధాశ్రమానికి
సోలార్ ప్లాంట్ వితరణ
భద్రాచలం: భద్రాచలంలోని సరోజమ్మ వృద్ధాశ్రమానికి దాతలు రూ.5లక్షల విలువైన సోలా ర్ ప్లాంట్ సమకూర్చారు. బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన గతంలో ఆశ్రమానికి భవనం నిర్మించారు. ఇప్పుడు ట్రస్టు చైర్మ న్ పంచాక్షరయ్య మనవడు సాయిపంచాక్షర్ తన మొదటి నెల వేతనం నుంచి రూ.5 లక్షలతో సోలార్ ప్లాంట్ సమకూర్చారు. ప్లాంట్‌ను పంచాక్షరయ్య శనివారం ప్రారంభించారు. తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ – నీలిమ, వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు పీఏసీఎస్ మాజీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, అడుసుమిల్లి జగదీశ్, పల్లంటి దేశప్ప, మోతుకూరి వీరయ్య, బొడ్డపాటి రామారావు, చావా లక్ష్మీనారాయణ, జలగం చంద్రశేఖర్, ఆశ్రమం నిర్వాహకులు సరోజనమ్మ, రఫీ పాల్గొన్నారు.
4.5 కిలోల
శిశువు జననం
అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రాగా, వైద్యులు ఆమెకు సాధారణ ప్రస వం చేశారు. ఆమె 4.5కిలోల బరువు ఉన్న మగ శిశువు జన్మించాడు. సహజంగా అప్పుడే జన్మించే శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని, 4.5కిలోల బరువు ఉండటం అరుదైన ఘటనగా ఆస్పత్రి గైనకాలజిస్టు మౌనిక తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఏకకాలంలో
పోలీసుల నాకాబందీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో పోలీసులు నాకాబందీ కార్యక్రమం చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పటిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు.


