కొత్త పింఛన్లకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లకు మోక్షం

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

● రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆశలు ● జిల్లాలో 69,136కు పైగా పెండింగ్‌ దరఖాస్తులు

● రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆశలు ● జిల్లాలో 69,136కు పైగా పెండింగ్‌ దరఖాస్తులు

చుంచుపల్లి: చేయూత పథకం కింద కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అర్జీదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా 2 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,13,942 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆసరా పథకం కోసం వచ్చిన కొత్త అర్జీలను వెనువెంటనే పరిష్కరించి పింఛన్లు విడుదల చేసేవారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులకు రూ. 2016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4016 చొప్పున ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేశారు. కానీ ఆ తర్వాత పింఛన్ల మంజూరులో జాప్యం జరుగుతోంది.

భారీగా చేయూత దరఖాస్తులు

2018లో అప్పటి ప్రభుత్వం పింఛన్‌ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2021 ఆగస్టు వరకు దరఖాస్తులను స్వీకరించి, 2022 ఆగస్టులో కొందరికి కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. మరికొందరికి మంజూరు కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరుతో మళ్లీ దరఖాస్తుల స్వీకరించింది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువు, చేనేత, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్‌, డయాలసిస్‌ బాధితులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పింఛన్ల కోసం జిల్లాలో 69,136 దరఖాస్తులు అందాయి. ఇందులో దివ్యాంగులు 7,438 మంది ఉండగా, ఇతర పింఛన్ల కోసం 61,698 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆ తర్వాత కూడా పలువురు దరఖాస్తులు అందజేశారు. తాజాగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా ప్రతినెలా రూ. 25.73 కోట్లను జిల్లాలోని లబ్ధిదారులకు అందజేస్తోంది. కొత్తగా మంజూరు చేయబోయే పింఛన్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 233 కోట్లను మంజూరు చేసింది. ఈ విషయమై డీఆర్‌డీఓ ఎం.విద్యాచందనను సంప్రదించగా.. పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement