అశ్వాపురం: మండల పరిధి మొండికుంట వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా.. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన బొజ్జా హేమంత్ (25) సంగు వెంకటేశ్వరరెడ్డితో కలసి ఈ నెల 3న ట్రాక్టర్ ట్రక్కులో సున్నపు బస్తాలు వేసుకొని కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో మెండికుంట గ్రామ శివారు మల్లన్న గుడి సమీపాన మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ట్రక్కులో కూర్చున్న హేమంత్ రోడ్డుపై పడ్డాడు. దీంతో లారీ అతడిపై నుంచి వెళ్లి కొంత దూరం మేర ఈడ్చుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డికి ఎలాంటి దెబ్బలు తగల లేదు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సీఐ అశోక్‌రెడ్డి, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి లారీని పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లారు. మృతుడు తండ్రి బొజ్జా బొజ్జయ్య ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రూ.1.39 లక్షలు చెల్లించాలని తీర్పు
ఖమ్మంలీగల్: సేవా లోపం నిర్థారణ అయినందున ఫిర్యాదుదారుడికి రూ.1,39,810 చెల్లించాలని ఖమ్మం వినియోగదారుల కమిషన్ శనివారం తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన మండలేపు నాగేశ్వరరావు 2024 ఫిబ్రవరి 12న పాల్వంచలోని డిస్ట్రిబ్యూటర్ బానోత్ బిక్కులాల్ వద్ద ఒకాయ ఫ్రీడమ్ సిల్వర్ ఎలక్ట్రికల్ వాహనాన్ని రూ.54,810 చెల్లించి కొనుగోలు చేశాడు. ఆ సమయాన ఒకసారి చార్జ్ చేస్తే 70 – 75 కిలోమీటర్లు మైలేజీ వస్తుందని, 250 కిలోల బరువు మోస్తుందని తెలిపారు. కానీ మైలేజీ 12 – 18 కి.మీ. దాటకపోగా, సర్వీస్ ఇంజనీర్ బ్యాటరీ లోపం ఉందని తేల్చినా..మార్చడంలో కాలయాపన చేశారు. ఈమేరకు ఆయన న్యాయవాది ద్వారా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశాడు. దీన్ని విచారించిన కమిషన్ ఫిర్యాదుదారుకి కొత్త వాహనాన్ని ఇవ్వాలని లేదా రూ.54,810ను తిరిగి చెల్లించడంతో పాటు మానసిక వేదనకు రూ.75వేలు చెల్లించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించకపోతే ఏడు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించింది.


