పాలన పరేషాన్‌.. | - | Sakshi
Sakshi News home page

పాలన పరేషాన్‌..

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

పొంతనలేని రేట్లు, లెక్కలు..

వేతనాల్లో కూడా వ్యత్యాసాలతో

అసహనం

కార్పొరేటర్ల వినతులపై స్పందన కరువు

ఎజెండాలో పొంతన లేని లెక్కలు, ఖర్చులు

60 డివిజన్లలో కానరాని అభివృద్ధి

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారి న తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడుతాయని భావిస్తే అందుకు భిన్నంగా పాలన సాగుతోంది. కార్పొరేటర్లు డివిజన్లలోని ప్రజల సమస్యలపై విన్నవించినా పరిష్కారం కావడం లేదు. చేసిదేమీ లేక కార్పొరేటర్లు వారి డివిజన్‌ సమస్యలను సోషల్‌ మీడియా గ్రూప్‌లలో పోస్టులు పెట్టి పరిష్కరించాలని మేయర్‌, కమిషనర్‌ను అడుగుతున్న దుస్థితి నెలకొంది. అయినా కూడా స్పందన రాకపోవడంతో ప్రజల వద్ద అవమానానికి గురవుతున్నామని కార్పొరేటర్లు వారి సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లోని డివిజన్లలో కోతులు, కుక్కల దాడులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. గతంలో ఏపీనుంచి ప్రత్యేక సిబ్బందిని కొత్తగూడెం తీసుకవచ్చి కోతు లు, కుక్కలను పట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించే వారు. పట్టిన కోతులను అడవుల్లో వదిలి, కుక్కలను ఏబీసీ సెంటర్‌కు తరలించి వ్యాక్సినేషన్‌ చేయించేవారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో జరిగిన ప్రక్రియ కార్పొరేషన్‌ అయిన తరువాత కనుమరైందని, నూతన పాలకవర్గం, కమిషనర్‌పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడిపై కోతులు దాడి చేసి గాయపరిచగా.. మేయర్‌, కార్పొరేటర్లు పరామర్శించి వదిలేశారు. కానీ, కోతులు, కుక్కలను పట్టించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ తొలి పాలకవర్గ సమావేశంలో కమిషనర్‌, మేయర్‌ కార్ల అలవెన్స్‌లంటూ ఎజెండాలో అంశాలుగా చేర్చారు కానీ, ప్రజ ల సమస్యల పరిష్కరించే అంశాలపై దృష్టి సారించలేదని కార్పొరేటర్లే నిలదీశారు. అలాగే, పాల్వంచలోని రెసిడెన్షియల్‌ భూములను కమర్షియల్‌గా, కమర్షియల్‌ భూములను రెసిడెన్షియల్‌గా మార్చేందుకు ఎజెండాలో అంశాలుగా చేర్చడంతో కొందరు కార్పొరేటర్లు అధికారులను, మేయర్‌ను నిలదీశారు. ఎవరి ప్రయోజనం కోసం భూములను మార్చాలని ఎజెండాలో చేర్చారని ప్రశ్నించారు.

పాల్వంచపైనే నజర్‌..

కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌ కలుపుకొని 60 డివిజన్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కాగా, మేయర్‌, కమిషనర్‌ కార్పొరేషన్‌ కార్యాల యంలో కంటే పాల్వంచలోనే ఎక్కువ సమయం ఉంటున్నారని, కొత్తగూడెం సమస్యలు కూడా పట్టించుకోవాలని కార్పొరేటర్లు, ప్రజలు కోరుతున్నారు. పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన మేయర్‌ కొంత మంది ఫోన్లకు సైతం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. పాల్వంచలోని డివిజన్లలో పర్యటిస్తున్నారు కానీ, కొత్తగూడెం డివిజన్లలో కూడా ఎన్నో సమస్యలపై దృష్టిసారించడం లేదని వాపోతున్నారు.

సమస్యలెన్నో..

కొత్తగూడెంలో ఎన్నో సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని కార్పొరేటర్లు చెబుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సింగరేణి ఆస్పత్రి నుంచి సెవెన్‌హిల్స్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, కార్పొరేషన్‌లో వీకెండ్‌ స్పాట్‌గానీ, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం పొందేందుకు పార్కులు గానీ చెప్పుకోదగినవి లేవని చెబుతున్నారు. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి రెండు నెలలు కావొస్తుండగా.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

కార్పొరేషన్‌ తొలిపాలకవర్గ సమావేశంలో బడ్జెట్‌ రూపకల్పన అంతా అయోమయంగా ఉంది. లెక్కలు కార్పొరేటర్లకు కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. వచ్చే ఆదాయం, ఖర్చు, మిగులు ఆదాయం అన్నీ కూడా ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉండడంతో కార్పొరేటర్లు నిలదీశారు. రంజాన్‌ సందర్భంగా దర్గాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు, మంచినీటి సౌకర్యాలకు రూ.లక్షలు కేటాయించినట్లు ఎజెండాలో చూపించారు. పరీక్షకేంద్రాల్లో తాగు నీటి ఏర్పాటు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల ఏర్పాట్లకు కూడా రూ.లక్షల్లో ఖర్చయినట్లు చూపిస్తూ ఎజెండాలో చేర్చడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి సమావేశమే ఇలాఉంటే.. భవిష్యత్‌లో జరిగే పాలకవర్గ సమావేశాలు ఎలాఉంటాయోనని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు.

పాల్వంచపైనే దృష్టి సారిస్తున్న మేయర్‌, కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement