పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఆదర్శం
దొడ్డి కొమరయ్య జీవితం
కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): దొడ్డి కొమరయ్య జీవితం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దొడ్డికొమరయ్య జయంతిని నిర్వహించారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్. మైనార్టీసంక్షేమాధికారి సంజీవరావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొమరయ్య పోరాట స్ఫూర్తి ఆచరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, దూడల బుచ్చయ్య, సుంక పెద్దాపురం, కంచర్ల లింగయ్య, బైరి రవి కుమార్, కె.సాయికుమార్, దూడల కిరణ్, సంక్షేమాధికారులు పాల్గొన్నారు.
గిరిజనుల
సంక్షేమానికి కృషి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంఅర్బన్: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఐటీడీఏ కృషిచేస్తున్నట్లు పీఓ బి. రాహుల్ తెలిపారు. శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చారు. శుక్రవారం ఐటీడీఏలో సమావేశం నిర్వహించగా, పీఓ వారికి వివిధ సంక్షేమ పథకాల అమలుతీరును వివరించారు. అనంతరం వారు భద్రాచలం ఏరి యా ఆస్పత్రిని సందర్శించగా, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వివరించారు. ఆ తర్వాత తాత గుడిసెంటర్‌లోని గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధవుతున్న యువతకు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో అధికారులు అశోక్, మధుకర్, అరుణ కుమారి, ఉదయ్ కుమార్, వేణు పాల్గొన్నారు.
గోదావరిలో
తగ్గిన నీటిమట్టం
మణుగూరు రూరల్: గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలోని చినరాయిగూడెం ఇంటేక్‌వెల్‌కు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని ఇంటేక్‌వెల్ వైపు మళ్లించే పనులు కొనసాగుతున్నాయి. పనులను పూర్తికాగానే పుర ప్రజలకు నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.


