కారేపల్లి: మండలంలోని గుట్టకిందిగుంపు గ్రామంలో గంగదేవి గుట్టపై గోదాం నిర్మాణ ప్రదేశాన్ని గిడ్డంగుల సంస్థ ఎస్‌ఈ ఆర్.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. గోదాం నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మట్టిని జేసీబీలతో తొలగించి బయటకు తరలిస్తుండడంతో ఇటీవల సర్పంచ్ ఉండం రాఘవులుతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. అంతేకాక గోదాం కోసం గుట్టను ధ్వంసం చేయవద్దని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఎస్‌ఈ శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, గోదాం కోసం గుట్టను తొలగిస్తూ పర్యావరణాన్ని నాశనం చేయొద్దని కోరడమే కాక గ్రామపంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండా పనులు చేపట్టారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాగా, నిర్మాణానికి కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని వెల్లడించిన ఎస్‌ఈ.. స్థానికులు అభ్యంతరం చెబితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సింగరేణి సీఐ సాగర్, సర్పంచ్ ఉండం రాఘవులు, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, తొగర శ్రీను పాల్గొన్నారు.


