సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో జాతీయ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు సూ చించారు. కచ్చితమైన డేటా సేకరించాలని ఆదేశించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు కలెక్టరేట్‌లో ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన శిక్షణ కార్యక్రమంంలో సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్లు ఎన్.శివరామకృష్ణ, డాక్టర్ పి.సుస్మిత రజినిలు 34 మంది ఫీల్డ్ ట్రైనర్లకు జనగణన నిర్వహణ, హౌస్ సెన్సెస్, డేటా సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ పద్ధతుల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా మూడో రోజు పాలకోయతండా ప్రాంతంలో డెమో నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనర్లను తీసుకెళ్లి ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించే విధానాన్ని ప్రదర్శించా రు. మొదటి ఇంట్లో హౌస్ సెన్సెస్ కార్యక్రమాన్ని కలెక్టర్ అంకిత్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ డేటా సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ జిల్లా అధికార సిబ్బంది, సీపీఓ సంజీవరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


