పంట మార్పిడితో రైతులకు లాభాలు | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో రైతులకు లాభాలు

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రతీ సీజన్‌లో ఒకే పంట కాకుండా మార్పిడి ద్వారా రైతులకు లాభాలు ఉంటాయని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.భరత్‌ తెలిపారు. కొత్తగూడెం కేవీకే ఆధ్వర్యాన మంగళవారం రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ పంట మార్పిడితో నీరు, ఎరువుల వాడకం తగ్గుతుందని తెలిపారు. వానాకాలంలో వరి సాగు చేసే రైతులు యాసంగిలో పెసర, మినుము, బొబ్బెర, ఉలవలు, వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు వేసుకోవాలని సూచించారు. తద్వారా భూసారాన్ని పరిరక్షించినట్లవుతుందని తెలిపారు. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా సురక్షితమైన దిగుబడులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రాజేశ్వరి, ఉద్యాన అధికారి మీనాక్షి, శాస్త్రవేత్తలు శివ, శాస్త్రవేత్త రవీందర్‌ పాల్గొన్నారు.

రూ.1.15కోట్లు

పలికిన ఆశీలు

మూడోసారి ముడిపడిన వేలం

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఆశీలు (వాహనాల పార్కింగ్‌ ఫీజు వసూళ్లు) అప్పగించేందుకు వేలం ఖరారైంది. గత ఏడాది వేలంలో రూ.1.25 కోట్లు పలకగా, ఈ ఏడాదికి గాను గతనెల 18న మొదటిసారి నిర్వహించిన వేలంలో రూ.82లక్షలే నమోదైంది. దీంతో వాయిదా వేసిన అధికారులు మార్చి 30న నిర్వహిస్తే రూ.88 లక్షలకు మించి పాడకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు. ఈమేరకు మూడోసారి మంగళవారం వేలం నిర్వహించగా ఇద్దరు పోటీ పడడంతో రూ.1.15కోట్లకు సోడే రామారావు దక్కించుకున్నాడు. కాగా, మొదటి రెండు సార్లు కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ధర పెంచొద్దని నిర్ణయించుకున్నట్లు తెలియగా, మూడోసారి కూడా ఫలితం లేకపోతే గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఆశీలు నిర్వహించాలనే భావనకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి కాంట్రాక్టర్లు పోటీ పడినట్లు తెలిసింది. అయినా గత ఏడాదితో పోలిస్తే రూ.10లక్షలు తగ్గడం గమనార్హం.

‘మన్‌ కీ బాత్‌’లో

ప్రధాని ప్రశంసలు

వ్యవసాయ కళాశాల విద్యార్థికి సన్మానం

అశ్వారావుపేటరూరల్‌: ప్రధాన మంత్రి మోదీ మన్‌కీ బాత్‌లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థిని ప్రశంసించడం కళాశాలకు గర్వకారణమని అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ అన్నారు. మై భారత్‌ పోర్టల్‌ ద్వారా వికసిత్‌ కృషి, వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతు సంక్షేమం అంశంపై కళాశాల విద్యార్థి కె.రఘువీర్‌రెడ్డి ప్రజెంటేషన్‌ ఇవ్వగా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’లో ప్రస్తావించిన మోదీ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రఘువీర్‌తోపాటు భారత్‌ యంగ్‌ లీడర్‌ డైలాగ్‌ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఎస్‌.సాత్విక, వికసిత్‌ భారత్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న మహర్షి వేద వ్యాస్‌ తదితరులను మంగళవారం సన్మానించాక హేమంత్‌కుమార్‌ మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డాక్టర్‌ పి.ఝాన్సీరాణి, ప్రొఫెసర్లు డాక్టర్‌ నాగాంజలి, రాంప్రసాద్‌, జంబమ్మ, శిరీష, దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్‌ శాఖకు రూ.200కోట్ల రాబడి

చివరి మూడు రోజులు

రాత్రి 8 గంటల వరకు కార్యాలయాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరమంతా కలిపి 45 వేల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేశారు. వీటితో పాటు మ్యారేజీలు, మార్టిగేజ్‌లు, స్టాంపుల విక్రయాలు కలిపి రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం చివరి మూడు రోజులు రాత్రి 8గంటల వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు విధులు నిర్వహించారు. అయితే, అధికారులు ఆశించిన విధంగా ముగింపు రోజైన మంగళవారం రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలుస్తోంది. ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 13,864 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ జరిగినా రూ.104.30 కోట్ల ఆదాయమే వచ్చింది. 2024–25లో 14,258 డాక్యుమెంట్లకు గాను రూ.107.63 కోట్లు ఆదాయం నమోదైంది. దీంతో గత ఏడాది కంటే ఈసారి రూ.3.08 కోట్ల ఆదాయం తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement