వాయిదా పడుతున్న ఇల్లెందు, ఎదురుచూస్తున్న ‘పేట’
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో
ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క దానికీ ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్‌ప్లాన్ తయారీకి ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు
కొలువుదీరిన నేపథ్యాన మాస్టర్ ప్లాన్‌పై దృష్టి సారించాల్సిన అవసరముంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
అప్పుడు విడివిడి.. ఇప్పుడు కలిసి
తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే 2014లో కొత్తగూడెం మాస్టర్ ప్లాన్, పాల్వంచకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2005లో ఆమోదం పొందింది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ భవన నిర్మాణ అనుమతులు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే గతేడాది ఈ రెండు మున్సిపాలిటీలకు తోడు సుజాతనగర్‌లోని ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ 60డివిజన్లతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)ను ఏర్పాటుచేశారు. దీంతో పెరిగిన హోదాకు తగినట్లు, ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈమేరకు కొత్తగూడెం, పాల్వంచలో డ్రోన్ సర్వే చేపట్టగా.. సుజాతనగర్‌లో నిర్వహించాల్సి ఉంది. కార్పొరేషన్ చుట్టూ విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్, 1/70 చట్టాలను పరిగణనలోకి తీసుకోవడమే కాక చుట్టుపక్కల అర్బన్ ప్రాంతంగా మారిన లక్ష్మీదేవిపల్లి, శ్రీనగర్ కాలనీ, చుంచుపల్లి మండల పరిధిలోని సబ్ అర్బన్ ఏరియాను కూడా పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడవు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా..
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. రెండు పట్టణాల్లో పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు, చిన్న బజార్, పెద్దబజార్, పాల్వంచలోని శాస్త్రి రోడ్డు వంటి వాణిజ్య కేంద్రాలు పార్కింగ్ సమస్య కారణంగా గత వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యాన పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపడం అత్యవసరం. ఇక రెండు జాతీయ రహదారుల కారణంగా నగరానికి బైపాస్ రోడ్డు వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆటోనగర్‌తో పాటు ఈ రహదారిని కేంద్రంగా చేసుకుని కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటును పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంటిపోరుతో వెనక్కి..
వందేళ్లకు పైగా అర్బన్ ప్రాంతంగా చరిత్ర కలిగిన ఇల్లెందు పట్టణానికి మాస్టర్ ప్లాన్ కరువైంది. ఇక్కడి 24 వార్డుల్లో 50 వేలకు పైగా జనాభా ఉంది. సింగరేణి గనులు తగ్గిపోవడంతో ఒకప్పుడు కళకళలాడిన పట్టణం క్రమంగా ప్రాభవం కోల్పోయింది. అయితే జీఓ 76 తర్వాత పట్టణానికి కొత్త కళ వచ్చింది. సింగరేణిపై ఆధారపడకుండా రూరల్ ఎకానమీ ఆధారంగా ఇల్లెందు పుంజుకుంటోంది. దీనికి తగినట్లుగా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. గత పాలకమండలి 2023లో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆలోచన చేసినా.. చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వివాదంతో అది మరుగున పడింది. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గమైనా ఈ దిశగా అడుగులు వేయాలని ఇల్లెందు వాసులు కోరుతున్నారు.
జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు
కొత్త మాస్టర్ ప్లాన్ కోరుతున్న కేఎంసీ


