నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● చివరి గింజ వరకూ కొనుగోళ్లకు సిద్ధం ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో సన్న రకం 1,35,365 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 51,944 మెట్రిక్ టన్నులు ఉండగా.. కొనుగోళ్లకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరానికి అనుగుణంగా అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, ‘బీ’ గ్రేడ్‌కు రూ.2,369 ధర నిర్ణయించగా, సన్న రకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ అందుతుందని తెలిపారు. ఈమేరకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సమకూర్చాలని ఆదేశించారు. అలాగే, రద్దీ నియంత్రణ కోసం రైతులకు టోకెన్లు జారీ చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపారు. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. ఇదేసమయాన సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీఓ మధు, సివిల్ సప్లయీస్ డీఎం త్రినాధ్‌బాబు, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, డీఏఓ బాబురావు, తూనికలు, కొలతల అధికారి మనోహర్, డీఎంఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభల నిర్వహణపై...
99రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం నుంచి గ్రామసభల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామపంచాయతీల వారీగా సభలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలు, అందుతున్న నిధులపై వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ విద్యచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, డీపీఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే కాక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, కళాశాల, పడమటనర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థులతో మాట్లాడిన ఆయన మెనూ అమలుపై ఆరా తీశాక విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. అలాగే, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్ధాల నాణ్యతను తనిఖీ చేయగా మెనూ పాటించడంలేదని తేలడంతో అసహనం వ్యక్తం చేశారు. తాజా కూరగాయలతో ఆహారం అందించాలని ఆదేశించారు. అలాగే, ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించాలని తెలిపారు. అనంతరం పడమటనర్సాపురం ఏజీహెచ్‌ఎస్‌లో తనిఖీ సందర్భంగా స్టోర్ రూమ్‌లో కూరగాయలు దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ మిషన్ పని చేయకపోవడంపైనా ఆరా తీశారు. తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంఈఓ బానోత్ జుంకీలాల్, ఎంపీఓ టి.తులసిరామ్, ఆర్‌ఐ సీహెచ్.ఆదినారాయణ, కేజీబీవీ ఎస్‌ఓ పద్మ, ఏజీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సుభద్రమ్మతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


