● బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ ● గత ఏడాది కంటే మింత తక్కువగా నమోదు
రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయింది. సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల్లో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా.. మంగళవారంతో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 58 మిలియన్ టన్నులకే పరిమితమైంది. దీంతో 14 మిలియన్ టన్నుల లోటు నమోదైంది. గత ఏడాది 72 మి.టన్నుల లక్ష్యంలో 69 మి.టన్నుల ఉత్పత్తి సాధిస్తే, ఈసారి అంత కంటే 11 మి.టన్నుల వెనుకంజలో ఉండడం గమనార్హం.
అగ్రస్థానాన సత్తుపల్లి
ఏటా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఇందులో నుంచి 18 ఓపెన్‌కాస్ట్ గనులు, 20 భూగర్భ గనులకు రోజు, నెల వారీ లక్ష్యాలను కేటాయిస్తారు. అయితే, ఈసారి సంస్థ పరిధిలోని 12 ఏరియాలకు గాను రెండు ఏరియాల్లోనే 100 శాతం ఉత్పత్తి సాధ్యమైంది. సత్తుపల్లిలో 103 శాతం, బెల్లంపల్లి ఏరియా 101 శాతం ఉత్పత్తి సాధించి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మిగిలిన కొత్తగూడెం ఏరియా 92, ఇల్లెందు 50, మణుగూరు 92, మందమర్రి 71, శ్రీరాంపూర్ 68 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే, రామగుండం–1 ఏరియాలో 82, రామగుండం–2 ఏరియా 89 శాతం, రామగుండం–3లో 71 శాతం, ఆండ్రియాల ఏరియాలో 11 శాతం, భూపాలపల్లి ఏరియా 61 శాతమే ఉత్పత్తి నమోదు చేయగలిగాయి.
లక్ష్యాన్ని సవరించినా..
సింగరేణి సంస్థ 2025–26కు తొలుత 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ భారీ వర్షాలకు తోడు మొదటి మూడు నెలల్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి నమోదు కాకపోవడంతో లక్ష్యాన్ని 72 మిలియన్ టన్నులకు కుదించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో 60 మిలియన్ టన్నులకు తగ్గించారు. అయితే, ఇది కూడా చేరలేక 58 మిలియన్ టన్నులకే పరిమితం కావడం గమనార్హం.
సవాలక్ష కారణాలు
సంస్థ నిర్దేశించుకున్న మేర బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ జరుగుతోంది. ప్రతీనెల లక్ష్యం, దాన్ని చేరుకునేలా కార్యాచరణపై ప్రతీ మంగళవారం, శనివారం అన్ని ఏరియాల్లో అధికారులు సమీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆ నెల వెనుకబడడానికి కారణాలపై చర్చిస్తూనే మరుసటి నైలెనా మెరుగుపడాలని ఆదేశిస్తారు. అయినా ఫలితం లేకపోగా ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లక్ష్యానికి దూరంగానే ఉండడం గమనా ర్హం. అంతేకాక గతంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కార్మికులంతా విధులకు హాజరుకావాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తే ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించేవారు. కానీ ఈసారి అలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. లక్ష్యం మేర ఉత్పత్తి చేస్తే లాభాలు కూడా అధికంగా ఇవ్వాల్సి వస్తుందనే భావనతోనే అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి.


