రణరంగం.. | - | Sakshi
Sakshi News home page

రణరంగం..

Mar 25 2026 7:13 AM | Updated on Mar 25 2026 7:13 AM

కళ్లకు గంతలు ఎన్నాళ్లు..

అభివృద్ధి నిధుల ప్రస్తావనతో ఆఽధిపత్య పోరు అధికారుల పట్టింపులేనితనంతో బరితెగింపు రాత్రయితే బాహాబాహీ.. తెల్లారేకల్లా గప్‌చుప్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇసుక, ఇటుక మాఫియా మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో జిల్లా కేంద్రంలో శివారు ప్రాంతం సోమవారం రాత్రి దద్దరిల్లింది. చాటుమాటు వ్యవహారం కావడంతో రాత్రి వేళ తరచూ తలలు పగిలేలా కొట్టుకుంటున్నా.. తెల్లవారేసరికల్లా గప్‌చుప్‌ అవుతున్నారు.

అక్రమ దందా

కొత్తగూడెం శివారులోని లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడు వాగు నుంచి ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రయితే చాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో వాగులోకి దిగి లోడ్ల మీద లోడ్ల ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాయి. పైగా వేసవి మొదలవడంతో నిర్మాణ రంగంతో పాటే దందా కూడా పెరిగింది. అయితే, ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లా కేంద్రం చుట్టు పక్కల పంచాయతీల్లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఫలితంగా ముర్రేడు వాగు ప్రవహిస్తున్న గ్రామాలకు చెందిన పరిరక్షణ కమిటీలు సోమవారం ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నాయి. తమ పంచాయతీ పరిధిలో ఇసుక తరలిస్తున్నందున గ్రామ అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

వారి సంగతేంటి ?

ఇన్నాళ్లు స్వేచ్ఛగా అక్రమ ఇసుక తోలకాలు జరగగా, అకస్మాత్తుగా వచ్చిన మార్పు వెనుక ఇటుక బట్టీల నిర్వాహకులు ఉన్నారనే సందేహం ఇసుక ట్రాక్టర్లు నడిపే వారికి వచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగి ఇటుక బట్టీల దగ్గర భారీ కలప లోడును పట్టుకున్నారు. ఇది కూడా అక్రమమే అయినందున వీరి నుంచి ఎలాంటి టోల్‌ వసూలు చేస్తున్నారంటూ పరిరక్షణ కమిటీలతో వాదనకు దిగారు. ఈ అంశం ఇటుక మాఫియాకు కంటగింపుగా మారడంతో సోమవారం రాత్రి అనిశెట్టిపల్లి దగ్గర ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కర్రలు, రాళ్లతో పరస్పరం ఇష్టారీతిగా కొట్టుకున్నట్టు సమాచారం.

లోడెత్తేశారు !

ఇసుక, ఇటుక వర్గాల మధ్య ఘర్షణ శ్రుతి మించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆపై గొడవ కాస్తా పంచాయితీగా మారి కేంద్రం అనిశెట్టిపల్లి నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్‌కు మారినట్లు సమాచారం. ఇదే సమయాన ఇటుక బట్టీల వద్ద అక్రమ కలప వ్యవహారం బయటకు పొక్కితే తనకు ఇబ్బంది అవుతుందని భావించిన ఓ అటవీ ఉద్యోగి రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఓ వైపు ఇరువర్గాల పంచాయితీ జరుగుతుండగానే.. కలపలోడ్‌ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. ఆపై ఇరువర్గాల పనుల్లోనూ లోపాలు ఉన్నందున కేసులు పెట్టుకుంటే రెండు వైపులా నష్టం జరుగుతుందని పెద్దలు నచ్చజెప్పడంతో రాత్రి తలలు పగిలేలా కొట్టుకున్న వారు తెల్లారేకల్లా కలిసిపోయినట్లు తెలుస్తోంది.

కొత్తగూడెం కార్పొరేషన్‌, శివారు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోధుమ, ముర్రేడు వాగులతో పాటు కిన్నెరసాని నుంచి నిత్యం వందలాది ట్రిప్పుల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అలాగే, ఇటుక బట్టీల్లో భారీగా కలప వినియోగం ఇదే స్థాయిలో ఉంటుంది. ఫలితంగా అటవీ సంపదకు నష్టం జరుగుతోంది. ఈ దందాను మైనింగ్‌, అటవీ శాఖ ఉద్యోగులు చూసీ చూడనట్టుగా వదిలేస్తుండడంతో అక్రమార్కులు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే చేయడం మొదలుపెట్టేశారు. మరోవైపు ఈ దందా నుంచి వచ్చే ఆదాయం కోసం గ్రామాల్లోనూ వర్గాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

రెచ్చిపోతున్న ఇసుక, ఇటుక మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement