భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణానికి ఆదివారం గోటి తలంబ్రాలను సమర్పించారు. ఏటా ఏపీ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండకు చెందిన అప్పారావు బృందం ప్రత్యేకంగా నారు పోసి పంట పండించి ఒడ్లను భక్తిశ్రద్ధలతో ఒలిచి రామయ్యకు సమర్పిస్తారు. రెండు దశాబ్దాలుగా ఆయన నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సాగుతోంది. ఆదివారం భద్రాచలం చేరుకున్న కోరుకొండ భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి ఈఓ దామోదర్‌రావు, ఏఈవో శ్రవణ్‌కుమార్‌లకు గోటి తలంబ్రాలను అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన మల్లి విష్ణువందన బియ్యపు గింజలపై రామకోటిని రచించారు. ఆమె పోస్టు ద్వారా పంపించగా, ఆదివారం దేవస్థానానికి అందాయి. ఆమె పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండల పరిఽధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు మల్లెపూలతో కుసుమార్చన పూజ, విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను అందజేయాలని సూచించారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. డీర్ పార్కులోని దుప్పులు, డ్యామ్, జలాశయం తదితరాలను వీక్షించారు. అనంతరం రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు. పర్యాటకుల ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.28,375, టూరిజం శాఖకు రూ.16,430 ఆదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు.
నేడు విద్యుత్ ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సర్కిల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా 1,683 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు.


