సామాన్యుడి ఊసేది? | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడి ఊసేది?

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

వీఐపీ సెక్టార్లు, గ్యాలరీలపై అధికారుల ప్రత్యేక దృష్టి

సామాన్యుల వసతి పట్టని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఏటా రామయ్య కల్యాణ వేడుకల్లో భక్తులకు తప్పనిపాట్లు

శ్రీరామనవమి ఘడియలు సమీపిస్తున్నాయి. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక, సెక్టార్ల విభజన పనులు జోరందుకున్నాయి. భద్రాచలంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు స్వాగత ద్వారాలు సిద్ధమవుతున్నాయి. కరకట్టకు దిగువన బాపు రామాయణ ఇతివృత్తాల చిత్రాలు రంగులద్దుకుంటున్నాయి. తానీషా కల్యాణ మండపంలో తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు వీఐపీ సెక్టార్ల విభజన, సీటింగ్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ సామాన్య భక్తులు ప్రశాంతంగా కల్యాణం వీక్షించేలా కల్పించాల్సిన వసతులపై ఎవరూ నోరు మెదపడంలేదు. –భద్రాచలం

ఏటా పెరుగుతున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలతో మిథిలా స్టేడియంలోని సెక్టార్లు కిక్కిరిసి పోతున్నాయి. దీంతో ఈసారి సీఎం సెక్టార్‌తో పాటు ఇతర గ్యాలరీలపై అధికారులు కొత్త మ్యాప్‌లను సిద్ధం చేశారు. గతంలో సీఎం సెక్టార్‌లో 250 సీటింగ్‌ ఉండగా, మరో 50 పెంచి 300 మంది కూర్చునేలా మార్చారు. అందులోనే జ్యుడీషియల్‌, ఇతర ప్రధాన ప్రొటోకాల్‌ విభాగం ఉండే విధంగా సెక్టార్‌ను విభజించేలా యోచిస్తున్నారు. దీనిని సెక్టార్‌–1గా నామకరణం చేశారు. ఇక గతంలో ముందు వరుసలో వీవీఐపీ, తర్వాత వీఐపీ గ్యాలరీ ఉండేది. వీవీఐపీ పాస్‌లకు తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వీఐపీ, వీవీఐపీ.. రెండింటిని కలిపి ఒకటే సెక్టార్‌గా మార్చారు. దీనిని సెక్టార్‌–2గా పేర్కొంటున్నారు. సీటింగ్‌ కెపాసిటీ 500గా నిర్ణయించారు. ఇది సీఎం సెక్టార్‌కు వెనుక భాగంలో సగం వరకు ఉండగా, మరో సగం ఉభయదాతల సీటింగ్‌గా మార్చారు. రూ. 7500 విలువగల టికెట్‌పై భార్యాభర్తలు ఇద్దరు కల్యాణంలో పాల్గొనవచ్చు. ఈ సెక్టార్‌లో 800 టికెట్లు ఉండగా, 1600 సీటింగ్‌ ఉండనుంది. రూ.2500 విలువతో 1100, రూ.2000 విలువతో 380 టికెట్లతోపాటు రూ.1000, రూ. 300, రూ.150 విలువ గల టికెట్లకు సెక్టార్లను కేటాయిస్తున్నారు.

భద్రాచలంలో శ్రీరామనవమికి ముమ్మరంగా ఏర్పాట్లు

మంత్రి సమీక్షలో సామాన్యుల చర్చేది?

ఏటా శ్రీరామనవమికి ముందు డివిజన్‌, జిల్లా స్థాయిలో పలుమార్లు అధికారులు, మంత్రులు సైతం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 1న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమీక్ష జరిపారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు వీఐపీలకు కేటాయించిన సెక్టార్లపైనే చర్చించారు. సామాన్య భక్తులకు కల్పించాల్సిన వసతులపై సమావేశంలో కనీసం చర్చ రాకపోవటం శోచనీయం. రాముడి కల్యాణానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కల్పించాల్సిన వసతులపై దేవస్థానం, జిల్లా ఉన్నతాధికారులు విస్మరించటంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. గ్యాలరీలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయటం లేదు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు గతేడాది ఏర్పాటు చేసిన ఫాగ్‌మిస్ట్‌ను ఈసారి ప్రధాన సెక్టార్లకే పరిమితం చేయకుండా ఇతర గ్యాలరీల్లో కూడా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement