స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ అన్నారు. కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా న్యాయవాదులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి పాటిల్‌ వసంత్‌ మాట్లాడుతూ న్యాయరంగంలో మహిళల ఎదుగుదల అభినందనీయమని అన్నారు. మహిళలు న్యాయం, సమానత్వం, ధర్మాన్ని కాపాడే శక్తిగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జె.గోపీకృష్ణ, కార్యదర్శి బి.మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్‌, ప్రసాద్‌, ఆడపాల పార్వతి, కె చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ ఆదాయం

రూ.5 లక్షలు

ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. గతేడాది బ్రహ్మోత్సవాల తదుపరి నుంచి ఇప్పటివరకు హుండీలోని వేసిన నగదును లెక్కించారు. మొత్తం రూ. 5,34,196 ఆదాయం సమకూరినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. గతేడాది కంటే రూ. 23 వేల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement