రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని నడికుడిలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో తెల్లం విద్యాసాగర్(20) మృతి చెందగా మరో బాలుడు మడకం అక్షయ్ గాయపడ్డాడు. ఎస్సై గణేష్ కథనం ప్రకారం.. విద్యాసాగర్, అక్షయ్ నడికుడి నుంచి గంగోలు వస్తుండగా కాళికామాత దేవాలయం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా, అక్షయ్ చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కుక్కల బారి నుంచి నక్కకు రక్షణ
బూర్గంపాడు: మండలంలోని నకిరిపేట గ్రామ పరిధిలో బుధవారం ఓ నక్క పిల్లకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నక్క పిల్లను కుక్కలు వెంబడించగా అటుగా వెళ్తున్న బానోత్ రామకృష్ణ గమనించి కుక్కలను తరిమి తీవ్రంగా గాయపడిన నక్క పిల్లను రక్షించాడు. ఆ తర్వాత మోరంపల్లి బంజర్ పశువైద్యశాలకు తరలించగా, నక్క పిల్ల కాలుకు తీవ్ర గాయం కావడంతో దాని పాదాన్ని తొలగించిన వైద్యులు చికిత్స చేసి అటవీ శాఖ బీట్ అధికారులు రాజగోపాల్, నాగరాజుకు అప్పగించారు.
ట్రాలీ ఆటో బోల్తా : పది మందికి గాయాలు
ఎస్‌ఎస్ తాడ్వాయి: ఓ ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడగా పది మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా చర్లలోని గన్నవరం కాలనీకి చెందిన పలువురు సమ్మక్క – సారలమ్మ దర్శించుకునేందుకు ట్రాలీ ఆటోలో మేడారం బయలుదేరారు. తాడ్వాయి దాటాక మలుపు వద్ద ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని 30 మందిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తాడ్వాయి ఎస్సై జగదీశ్, సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను 108లో తాడ్వాయి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. ములుగు ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి సీతక్క పరామర్శించారు.
ఆళ్లపల్లిలో డ్రైవర్‌కు..
గుండాల: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఆళ్లపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఇచ్చినపల్లి గ్రామానికి చెందిన సూర్య ప్రకాష్ బుధవారం కంకర తోలెందుకు ట్రాక్టర్ తీసుకుని అడవిరామారం వెళ్లాడు. తిరిగి రామానుజగూడెం గ్రామానికి వెళుతుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సూర్యప్రకాష్ ఇంజన్ కింద పడ్డాడు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ట్రాక్టర్ ఇంజన్‌ను తొలగించి క్షతగాత్రుడిని 108 ద్వారా ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


