పొడుస్తున్న పొత్తులు
కాంగ్రెస్ – సీపీఐ మధ్య తేలని పొత్తు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
కలిసి వెళ్లాలని నిర్ణయం
కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తుపై
ఇంకా స్పష్టత కరువు
ఒంటరిగానే బరిలోకి కమలనాథులు
పంచాయతీ కలిసొచ్చిందని..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ మండలాల్లో బీఆర్‌ఎస్, సీపీఎం మద్దతుదారులు పొత్తుతో బరిలోకి దిగగా.. చెప్పుకోదగిన స్థానాలు వచ్చాయన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసి వెళితే విజయం తమదేనన్న భావనతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు బీఆర్‌ఎస్, సీపీఎం ముఖ్య నేతల మధ్య సోమవారం ఖమ్మంలో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే, ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్‌లోని ఏయే వార్డుల్లో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై మరోమారు భేటీ కానున్నట్లు తెలిసింది. అలాగే, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ – సీపీఎం ఒకే దారిలో వెళ్తాయని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు.
బలమున్న చోట పోటీ
బీఆర్‌ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదరడంతో ఏ మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి బలముందో గుర్తించేలా నేతలు కసరత్తు చేస్తున్నారు. ఏదులాపురం, మధిర, వైరా, అశ్వారావుపేట మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ వార్డులు, డివిజన్లలో పోటీ చేయాలన్న ఆలోచనలో సీపీఎం ఉన్నట్లు సమాచారం. మిగతా మున్సిపాలిటీల్లో కూడా పోటీకి సై అంటూనే బలమున్న చోట ఎక్కువ వార్డుల్లో పోటీ చేసి విజయం సాధిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని సీపీఎం నేతలు భావిస్తున్నారు. ఇక పొత్తు కుదిరిన నేపథ్యాన మెజార్టీ వార్డుల్లో బరిలోకి దిగి మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలనే భావనతో బీఆర్‌ఎస్ నాయకత్వం ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ నెగ్గాం.. ఎక్కడ తగ్గామన్న లెక్కలపై స్థానిక నేతలతో ముఖ్య నేతలు ఇప్పటికే చర్చించారు.
కమలనాథులు సై
ఉమ్మడి జిల్లాలో ఒంటరిగానే పోటీ చేసి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బలమున్న మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. మున్సిపాలిటీలను కై వసం చేసుకునే బలం లేకున్నా కొన్ని వార్డుల్లోనైనా కాషాయ జెండా ఎగురవేయాలని ఇప్పటినుంచే బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్‌షా వచ్చి ప్రచారం చేసినా ఉమ్మడి జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీజేపీ గెలిచే అవకాశం లేదని సీఎం రేవంత్‌రెడ్డి సీపీఐ శతాబ్ది సభావేదికగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని సవాల్‌గా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు పట్టు నిరూపించుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, సీపీఐ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల మద్దతుదారులు ఎవరికి వారు పోటీకి దిగారు. కొన్నిచోట్ల మాత్రం స్థానిక నాయకత్వం అంగీకారంతో ఒకటిగా పోటీ చేశారు. అయినా ఉమ్మడి జిల్లాలో మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. ఆ తర్వాత బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పంచాయతీ ఫలితాలను బేరీజు వేసుకుంటున్న సీపీఐ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంటుందా.. లేదా అన్న చర్చ మొదలైంది. సీపీఐ వందేళ్ల పండుగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనడం.. సభా వేదికగా సీపీఐ పోరాటాలను కొనియాడడం తెలిసిందే. ఈ పరిణామాలతో కాంగ్రెస్, సీపీఐ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వెళ్తాయనే సంకేతాన్ని రెండు పార్టీల నేతలు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అయితే మూడు, నాలుగు రోజుల్లో పొత్తుపై సీపీఐ స్పష్టత ఇచ్చే అవకాశముందని.. ఉమ్మడి జిల్లాలో పొత్తు కుదిరితేనే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందనే అభిప్రాయాన్ని ఇరు పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో
బీఆర్‌ఎస్ – సీపీఎం జట్టు


