రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడామండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘ ట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి అశ్వాపురానికి చెందిన ఇస్లావత్ నాగ, కమల దంపతులు సోమవారం రూ.1,00,116 అందజేశారు. వారికి ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు రసీదు ఇచ్చారు.
పామాయిల్ ఫ్యాక్టరీకి
రేపటి నుంచి సెలవులు
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో వార్షిక మరమ్మతులు నిర్వహించనున్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి సెలవులు ఇవ్వనున్నామని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. అప్పారావుపేట లో రెండు టన్నుల లోపు గెలలు మాత్రమే దిగుమతి చేసుకుంటామని, అశ్వారావుపేట ఫ్యాక్టరీ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఖమ్మం ఏసీబీ రేంజ్
ముందంజ
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజలకు సేవలందించేందుకు డబ్బు డిమాండ్ చేస్తున్న ఉద్యోగులను గుర్తించడమే కాక అక్రమార్కుల సమాచారం ఇచ్చేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంలో రాష్ట్రంలోనే ఖమ్మం ఏసీబీ రేంజ్ అధికారులు ముందంజలో నిలిచారు. ఈ మేరకు అధికారులను ఏసీబీ డీజీ చారుసిన్హా అభినందించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌కు జ్ఞాపిక, క్యాష్ అవార్డు అందజేశారు. అవినీతి నిర్మూలనకు కృషి, సమన్వయంతో కూడిన దర్యాప్తు. ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందు వరుసలో నిలిచారని ఆమె అభినందించారు.
మున్సిపల్ కౌన్సిలర్ స్థానానికి వేలం
●రూ.6లక్షలు, వాటర్ ప్లాంట్‌కు
కుదిరిన ఒప్పందం?
అశ్వారావుపేటరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మున్సిపల్‌పరిధిలో ఓ వార్డు కౌన్సిలర్ స్థానానికి వేలం నిర్వహించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఒకటో వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా, 778 ఓట్లు ఉన్నాయి. వార్డు పరిధిలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గంలోని ఓ కులానికి చెందిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉన్నా పోటీ విపరీతంగా ఉంది. ఆశావాహులు అధికం కావడంతో ‘కులం కట్టుబాటు’ కింద వేలం పాట నిర్వహించినట్లు తెలిసింది. ఈమేరకు ఇద్దరు పోటీ పడగా, ఒకరు కులానికి రూ.6లక్షల నగదుతోపాటు ఎన్నికయ్యాక వార్డు పరిధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
రామయ్యకు ముత్తంగి అలంకరణ


