‘కార్పొరేషన్’ టెన్షన్
జోరుగా సమీక్షలు,
సమావేశాలు...
హైకోర్టులో ఈ నెల 27కు
వాయిదా పడిన కేసు
మరోవైపు సాగుతున్న
అభ్యర్థుల ఎంపికలు
మేయర్ స్థానానికి పెరుగుతున్న పోటీ
మరో కేసు నాలుగు వారాలకు వాయిదా..
కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియకు డ్రా తీయగా మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు ఏయే వర్గాలకు దక్కాయనే వివరాలను ప్రకటించారు. అయితే ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించొద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే చర్చ ఓ వైపు నడుస్తుండగా.. మరోవైపు కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లకు అభ్యర్థుల ఎంపికలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్నచోట సమావేశాలు నిర్వహించి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో ఎస్సీలకు రిజర్వ్ అయిన డివిజన్లలో అభ్యర్థులు దొరకక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక గతంలో ఉన్న రెండు, మూడు వార్డులు కలిసి ఒక డివిజన్ కావడంతో మాజీ కౌన్సిలర్లంతా ఒకే స్థానం నుంచి పోటీ పడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కాగా.. ఆ స్థానానికి పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది.
ఈనెల 27కు వాయిదా..
ఏజెన్సీ ప్రాంతాలను విలీనం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేశారని, తద్వారా గిరిజనులకు అన్యా యం జరిగే ప్రమాదం ఉన్నందున కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించొద్దని కోరుతూ కొందరు హై కోర్టును ఆశ్రయించారు. వీటికి సంబంధించి సోమవారం వాదనలు జరగగా, తిరిగి ఈనెల 27కు వాయిదా పడింది. ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేయగా కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.
ఫిబ్రవరిలో మున్సిపల్ పోరు జరగునున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహిస్తూ కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరిగే రెండు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల గెలుపునకు కష్టపడి పని చేయాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు
పాల్వంచ: సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రా మ పంచాయతీలనునిబంధనలకు విరుద్ధంగా కొత్త గూడెం కార్పొరేషన్‌లో విలీనం చేశారంటూ పోట్రు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో వేసిన కేసు విచారణ మరో నాలుగు వారాలకు వాయిదా పడింది. అయితే ఈలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పాల్వంచ, సుజాతనగర్‌కు చెందిన ఇద్దరు మరో కేసు వేయగా, అది ఈనెల 27న విచారణకు రానుంది.


