ఇక ప్రతీ ఆదివారం నదీ హారతి
కాశీ తరహాలో..
● కాశీ తరహాలో భద్రాచలంలో నిర్వహణ ● ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కలెక్టర్ పాటిల్
భద్రాచలం: భక్తులు అత్యంత పవిత్రంగా పూజించే గోదావరి మాతకు నదీ హారతి వేడుక భద్రగిరి క్షేత్రంలో ఇక ప్రతీ ఆదివారం జరగనుంది. నదుల ప్రాముఖ్యతను తెలపడంతో పాటు నిర్వహణలో భక్తులు, యువతను భాగస్వామ్యం చేసేలా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీన్ని మొదట ఏరు ఉత్సవంలో భాగంగా ఒకరోజు జరపగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో వారి కోరిక మేరకు ప్రతీ ఆదివారం సాయంత్రం వేళ నదీ హారతి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక ఈ కార్యక్రమాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు.
హారతి దర్శనం పుణ్యఫలం..
భక్తులు ప్రతీ నదిని దేవుడితో సమానంగా భావిస్తూ పూజిస్తుంటారు. పుణ్యక్షేత్రాలతో అనుసంధానంగా ఉన్న నదుల్లో దైవ దర్శనానికి ముందే నదుల్లో స్నానం ఆచరించి, పసుపు, కుంకుమ, హారతి సమర్పిస్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం, నదీ హరతి ఎంతో పవిత్రమని పండితులు అంటున్నారు. భద్రగిరిలో ప్రవహిస్తున్న గోదావరికి మరింత ప్రాముఖ్యం ఉందని, అందుకే నిత్యం గోదావరి తీర్థంతోనే స్వామి వారికి ఆరాధన జరుగుతుందని తెలిపారు. నదీ జలంలో అమృతం ఉందని, తద్వారా దీర్ఘాయుషును కలిగిస్తుందని, దేశంలో నదులను సీ్త్రలకు ప్రతి రూపాలుగా పూజిస్తామని అంటున్నా రు. గోదావరికి నదీ హారతి సమర్పించినా, దర్శించినా పుణ్య ఫలం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
భక్తులు అత్యధికంగా సందర్శించే కాశీ పుణ్యక్షేత్రంలో ప్రతీ రోజు జరిగే నదీ హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. అటాంటి నదీ హారతిని భద్రాచలంలో చేపట్టాలని గతంలో భక్తుల నుంచి అనేక విన్నపాలు వచ్చాయి. కేవలం కార్తీక మాసంలో మాత్రమే దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకను జరుపుతారు. జిల్లాలో అటవీ, పర్యాటక, ఆధ్యాత్మిక రంగాలను అనుసంధానం చేస్తూ ఎకో టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ముక్కోటి ఉత్సవాల సమయంలో ‘ఏరు–ది రివర్ ఫెస్టివల్’లో తొలిసారి నదీ హారతి ఇవ్వగా భక్తులు, పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు గోదావరి ఘాట్ వద్ద ఈ వేడుకను జరపాలని కలెక్టర్ సూచించారు. నదీ హారతితో భద్రగిరి క్షేత్రానికి సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. భక్తులు భారీగా హాజరై ఈ వేడుకను విశ్వవ్యాప్తం చేయాలని కలెక్టర్ కోరారు.


