రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణోత్సనాన్ని ఘనంగా నిర్వహించారు.
వెండి శంఖం బహూకరణ
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రాజమండ్రికి చెందిన శ్రీధర్ రూ.1.90 లక్షల విలువైన 1,014 గ్రామల వెండి శంఖాన్ని ఆదివారం బహూకరించారు. ఈ మేరకు ఆయన ఆలయ ఈఓకు అందజేయగా దాతల కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


