రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు ● రైతుల సమగ్ర వివరాల నమోదు కోసం ఫార్మర్ రిజిస్ట్రీ..
కరకగూడెం: పట్టాదారు రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని అనంతారం గ్రామంలో పర్యటించి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోని రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం నగదు జమ కాకపోయే అవకాశముందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ 11 అంకెల బార్‌కోడ్‌తో కూడిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ అని, రైతులు సమీపంలోని మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో ఫొటో ద్వారా లేదా ఆధార్ ఓటీపీ ఆధారంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ చటర్జీ, ఏఈఓలు అనిల్‌కుమార్, ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.


