‘బంగారం’ వచ్చేస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

‘బంగారం’ వచ్చేస్తోంది..

Jan 10 2026 8:12 AM | Updated on Jan 10 2026 8:12 AM

‘బంగారం’ వచ్చేస్తోంది..

‘బంగారం’ వచ్చేస్తోంది..

● మేడారం మహా జాతరకు దిగుమతి అవుతున్న బెల్లం ● పలు రాష్ట్రాల నుంచి సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు

బెల్లం దిగుమతి చేసుకుంటున్నాం..

● మేడారం మహా జాతరకు దిగుమతి అవుతున్న బెల్లం ● పలు రాష్ట్రాల నుంచి సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు

సుజాతనగర్‌: మేడారం వన దేవతలు సమ్మక్క, సారమ్మకు భక్తులు నైవేద్యంగా సమర్పించే బంగారం (బెల్లం) నిల్వలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వ్యాపారులు పలురాష్ట్రాలు, ప్రాంతాల నుంచి బెల్లం తెప్పించి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో జిల్లాలో బెల్లం విక్రయించే హోల్‌ సేల్‌ షాపులు ఇదివరకే ఉండగా కొత్తగా మరికొన్ని వెలుస్తున్నాయి. జిల్లాలోని మరికొంత మంది వ్యాపారులు సైతం మహాజాతరకు బెల్లం నిల్వలను రెడీ చేస్తున్నారు.

పావు కిలో నుంచి 10 కిలోల వరకు..

మార్కెట్లో పావు, అరకిలో, కిలో, ఐదు, పది కిలోల చొప్పున బెల్లం నిల్వలు లభిస్తున్నాయి. కిలో బెల్లం ధర రూ.40 నుంచి రూ.70 వరకు నాణ్యత, దిగుమతి చేసుకునే ప్రాంతం, దూరం ఆధారంగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. అన్నింట్లోనూ కస్తూరి రకం అధిక నాణ్యమైందని, కిలో రూ.66 నుంచి రూ.70 వరకు ధర పలుకుతోందని తెలిపారు.

సమ్మక్క పున్నమితో ఇంటింటా పూజలు

ఈ నెల 3వ తేదీన సమ్మక్క పున్నం ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి 1న రానున్న పౌర్ణమి వరకు భక్తులు ఇంటింటా సమ్మక్క పూజలు చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర వారాల్లో పల్లెల్లో సమ్మక్క పూజల సందడి కనిపిస్తుంది. ఆ రోజుల్లో వీలు కాని వారు ఆదివారం చేస్తారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాతే జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ పూజల్లో ఎత్తు బెల్లం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో వనదేవతల పూజల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. బరువు ఎక్కువగా ఉన్న వారు అమ్మవార్లకు కొంత బెల్లంతో పాటు పంచదార (చక్కెర)ను కూడా నైవేద్యంగా అందిస్తున్నారు. చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ.40 ఉంది. గతంలో రూ.రెండు ఎక్కువ ఉన్నా ఇటీవల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో.. అంటే జనవరి 28, 29, 30 తేదీల్లో అమ్మవార్ల జాతర నిర్వహిస్తారు. జాతరలో భక్తులు వేల టన్నుల బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించనున్నారు.

దిగుమతి చేసుకునే రకం.. కిలో బెల్లం ధర

మహారాష్ట్ర నాందేడ్‌ రకం.. రూ.40

మహారాష్ట్ర పుణే రకం.. రూ.42

కర్ణాటక కోలాపూర్‌ రకం.. రూ.48

కర్ణాటక కస్తూరి రకం.. రూ.66

మేడారం మహాజాతర కోసం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నాం. పలు రకాలు, నాణ్యత ఆధారంగా ధరలు ఉన్నాయి. కొత్త బెల్లం అమ్మకానికి వస్తే తప్ప ఇప్పుడున్న ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. జాతర సమయం దగ్గర పడితే అప్పటి పరిస్థితి ఆధారంగా కొద్ది తేడాలతో ధరలు ఉండే అవకాశం ఉంది.

మిరియాల రామకృష్ణ,

కిరాణా వ్యాపారి, సుజాతనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement