కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛమిత్ర కార్మికుల ధర్నా
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాఠశాలలలో పనిచేస్తున్న స్వచ్ఛమిత్ర కార్మికులకు ఇచ్చే జీవితాల్లో కోతలు విధించొద్దని, స్వచ్ఛమిత్ర కార్మికుల జీతాలు వారి ఖాతాల్లోనే జమ చేయాలని సీఐటీయూ అనుబంధ శ్రామిక మహిళ కన్వీనర్ జి.పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛమిత్ర కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛమిత్ర నాయకురాలు నిహారిక అధ్యక్షతన జరిగిన సభలో పద్మ మాట్లాడారు. స్వచ్ఛమిత్ర కార్మికులు మొదట జీతం లేకుండానే పనిచేశారని, ప్రభుత్వం ఇప్పుడు పిల్లల ప్రాతిపదికగా నెలకు రూ.3 వేలు జీతం ఇస్తోందని, ఈ జీతంలో అధికారులు నెలకు రూ.500 నుంచి రూ.1,500 వరకు కట్ చేసి ఇస్తున్నారని తెలిపారు. ఎందుకు కట్ చేస్తున్నారని అడిగితే స్కూలు మెయింటెనెన్స్ కోసమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.3 వేల జీతాన్ని కూడా ఖాతాల్లో వేయకుండా అమ్మ ఆదర్శ కమిటీ, గ్రామ సంఘం కమిటీ, స్కూల్ హెచ్‌ఎంలు సంతకాలు పెడితేనే ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటనరసమ్మ, సీత, రాజమణి, కుమారి, ఈశ్వరమ్మ, సమ్మక్క, సుస్మిత పాల్గొన్నారు.


