మధ్యాహ్న భోజన వర్కర్ చేతివాటం..
● వంట గదిలో 117 కేజీల బియ్యం నిల్వలు ● వారంలో ఒక్కరోజే గుడ్డు
టేకులపల్లి:టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు (అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్) చేతివాటం బట్టబయలైంది. ఈ పాఠశాలలో స్కావెంజర్‌ను తొలగించాలని జరిగిన గొడవ కాస్త మధ్యాహ్న భోజన వర్కర్ పాల్పడిన అవకతవకలు వెలికితీతకు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ పాఠశాలకు చెందిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ (మధ్యాహ్న భోజన వర్కర్) పొగాకు లక్ష్మి, హెచ్‌ఎం మంగీలాల్‌లు స్కావెంజర్‌గా గోల్కొండ శ్యామలను మూడు నెలల క్రితం నియమించారు. అయితే స్కావెంజర్ అవకతవకలకు పాల్పడుతోందని, ఆమెను తొలగించాలని హెచ్‌ఎంను చైర్మన్ కోరగా.. ఆమె పనితీరు బాగానే ఉందని ఉపాధ్యాయులతో సహా తేల్చి చెప్పారు. ఈ విషయంలో మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయులకు, కొందరు పేరెంట్స్‌కు వాగ్వాదం కూడా జరిగింది. సంక్రాంతి తర్వాత చర్చిస్తామని హెచ్‌ఎం చెప్పారు.
అధికారుల విచారణ..
పాఠశాలలో మధ్యాహ్న భోజన వర్కర్‌గా పని చేస్తున్న పొగాకు లక్ష్మి అవకతవకలకు పాల్పడుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో వంట గదిని తనిఖీ చేయగా.. 117 కేజీల బియ్యం లభ్యమైంది. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలపడంతో గురువారం ఆర్‌ఐ రత్తయ్య ఆధ్వర్యాన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక రేషన్ డీలర్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే వారంలో మూడు గుడ్లకు బదులు ఒక్క టి మాత్రమే పెడుతోందని, వంట పాత్రలు సొంత అవసరాలకు వాడుకుంటోందని, ఉపాధ్యాయులను సైతం బెదిరిస్తుందనే ఆరోపణలు రావడంతో ఎంఈఓ జగన్‌నాయక్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయమై ఆమెను తొలగించనున్నట్లు హెచ్‌ఎం తెలపగా.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బియ్యాన్ని పొదుపు చేశానే తప్ప అక్రమంగా నిల్వ చేయలేదని లక్ష్మి పేర్కొంది.


