లక్ష్య సాధనకు కృషి చేయాలి
జూలూరుపాడు/చండ్రుగొండ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం ఆయన జూలూరుపాడు, చుంచుపల్లి, పెనగడప, చండ్రుగొండ పీహెచ్‌సీలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల పెంచాలని, ప్రతీ రెండో గురువారం పీహెచ్‌సీ పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాలపై వైద్యులు దృష్టి సారించాలని అన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో పర్యటించాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై పీహెచ్‌సీలకు సమాచారం అందజేయాలన్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పీహెచ్‌సీలు, విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్‌ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో వైద్యాధికారి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, వైద్యులు వెంకటప్రకాష్, తనుజా, తేజస్విని, నేహా ఆమరిన్, వెంకటప్రకాష్, ఆయుర్వేద డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్


