అభ్యాసం మెరుగుపర్చేలా..
రిసోర్స్ పర్సన్ల పర్యవేక్షణ
ఫిబ్రవరి 26న జాతీయ సాధన సర్వే ప్రభుత్వ బడుల్లో విద్యాప్రమాణాల మదింపునకు నిర్వహణ మూడు దశల్లో నమూనా పరీక్షలతో లోపాల గుర్తింపు
కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను సమగ్రంగా మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రాథమిక విద్యే భవిష్యత్‌కు పునాది అయినందున అది ఎంత బలంగా ఉందో తెలుసుకునేందుకు మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వారికి జాతీయ సాధన సర్వే పరీక్ష (నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే) నిర్వహణకు చర్యలు చేపట్టింది. చదవడం, రాయడం, గణితంపై విద్యార్థులకు ఉన్న అవగాహన స్థాయిని ఈ పరీక్ష ద్వారా పరిశీలించనున్నారు. జిల్లాలో 963 ప్రాథమిక, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా సుమారు 5వేల మంది మూడో తరగతి విద్యార్థులున్నారు.
ఫిబ్రవరి 26న పరీక్ష..
వచ్చే ఫిబ్రవరి 26న జాతీయ సాధన సర్వే పరీక్షను నిర్వహించనున్నారు. తెలుగు,ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల విద్యార్థులకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనుండగా, గణితం అంశంలో కూడా ప్రాథమిక స్థాయి సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను అన్ని అంశాల్లో సమగ్రంగా తీర్చిదిద్దాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు.
మూడు దశల్లో మాక్ టెస్టులు...
జాతీయ స్థాయి పరీక్షకు నేరుగా వెళ్లకుండా మూడో తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో మూడు దశల్లో నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మాక్ టెస్టుల ద్వారా విద్యార్థులు జాతీయ పరీక్షకు అలవాటు పడడంతో పాటు వారి సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది. గత డిసెంబర్ చివరి వారంలో తొలి పరీక్ష నిర్వహించగా ఈనెల మూడో వారంలో రెండో పరీక్ష, ఫిబ్రవరి రెండో వారంలో మూడో నమూనా పరీక్ష ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
అందుబాటులో మాదిరి ప్రశ్నపత్రాలు..
విద్యార్థులు,ఉపాధ్యాయుల సౌకర్యార్థం జాతీయ సాధన సర్వేకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను విద్యాశాఖ అధికారికంగా అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది.ఈ ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షా విధానం,ప్రశ్నల స్వరూపం,సమయ నిర్వహణ వంటి అంశాలపై విద్యార్థులకు ముందుగానే అవగాహన కలుగుతుందని అధికారులు తెలిపారు.ఉపాధ్యాయులు కూడా ఈ మాదిరి ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకుని తరగతి గదుల్లో ప్రత్యేక సాధన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సర్వే ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవిక విద్యా ప్రమాణాలను అంచనా వేసే అవకాశం లభించనుంది.అందిన ఫలితాల ఆధారంగా బోధనా విధానాల్లో అవసరమైన మార్పులు,శిక్షణ కార్యక్రమాలు,విద్యా విధాన పరంగా తీసుకోవాల్సిన సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లభించే అవకాశముందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఉన్న అభ్యాస సామర్థ్యాన్ని స్పష్టంగా తెలుసుకోవడం మా ప్రధాన ఉద్దేశం.చిన్న తరగతుల్లోనే చదువు పునాది బలపడితేనే భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.అందుకే మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం.ముందస్తు సాధన పరీక్షల ద్వారా పిల్లలు ఎలాంటి అంశాల్లో ఇబ్బంది పడుతున్నారో గుర్తించి,ఆ లోపాలను సరిదిద్దే విధంగా బోధన కొనసాగించనున్నాం.ఉపాధ్యాయులు,ఫీల్డ్ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తాం.
– నాగరాజశేఖర్,
జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్
జాతీయ సాధన సర్వేకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేస్తోంది.వీరికి ముందుగా అవసరమైన శిక్షణ అందించి,ఆయా పాఠశాల సముదాయాల పరిధిలో నమూనా పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్షల నాణ్యతతో పాటు పారదర్శకతను కూడా నిర్ధారించనున్నారు.నమూనా పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి,వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.అవసరమైన చోట అదనపు బోధన,ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టనున్నారు.ప్రస్తుతం ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో అంచనా వేయనున్నారు.విద్యార్థులు ఎక్కడ లోపాలు ఎదుర్కొంటున్నారో గుర్తించి,అందుకు అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావడంతో పాటు,విద్యా నాణ్యతను మెరుగుపర్చే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థుల సామర్థ్యానికి అసలైన పరీక్ష
అభ్యాసం మెరుగుపర్చేలా..
అభ్యాసం మెరుగుపర్చేలా..


