మంత్రి ఆదేశాలు బేఖాతరు..
రుద్రంపూర్: ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ మాయాబజార్ ఇళ్లను కూల్చివేశారని, ఇళ్లు నిర్మించుకునేంత వరకు అవకాశం ఇవ్వాలని కోరినా.. సింగరేణి అధికారులు కనికరం చూపలేదని ధన్‌బాద్ పంచాయతీ మాయాబజార్ నివాసులు వాపోయారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీ విస్తరణలో భాగంగా మాయాబజార్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సింగరేణి యాజమాన్యం తెలిపింది. గంగహుస్సేన్‌బస్తీలో నిర్వాసితులకు 100 గజాల స్థలం కేటాయించింది. అక్కడ ఇళ్లు కట్టుకోవడానికి నిర్వాసితులు మూడు మాసాల గడువు కోరారు. ఖమ్మం ఎంపీ, రాష్ట్ర మంత్రులు సానుకూలంగా స్పందించి ఒప్పకున్నారు. కానీ, సింగరేణి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది తమ ఇళ్లను కూల్చివేశారని నిర్వాసితులు తెలిపారు. సింగరేణి అధికారుల తీరుపై తాము ఎస్పీని ఆశ్రయించనున్నామని వెల్లడించారు. ఈ విషయమై ఏరియా జీఎం ఎం.శాలేంరాజును వివరణ కోరగా.. ఎంపీ ఇచ్చిన గడువు తీరిన నేపథ్యంలో విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన తరువాతే తాము కూల్చివేశామన్నారు. ఇంటి స్థలం కేటాయించి సుమారు రెండున్నరేళ్లు అవుతోందని వెల్లడించారు.
మాయాబజార్ ఇళ్లు కూల్చివేసిన
సింగరేణి సెక్యూరిటీ


