వ్యవసాయ రంగం మహోన్నతమైనది
● ఐఏఎస్ అంటే ‘ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్’ ● వ్యవసాయ యూనివర్సిటీ క్రీడా పోటీల ప్రారంభంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్
అశ్వారావుపేట : వ్యవసాయ రంగం ఎంతో ముఖ్యమైన, శక్తివంతమైన వృత్తి అని, సాంకేతికత సహాయంతో ఈ రంగంలో త్వరలోనే పెను మార్పులు చోటు చేసుకుంటాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు అశ్వారావుపేటలో నాలుగు రోజుల పాటు క్రీడలు నిర్వహించనుండగా.. ఈ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సగటు రైతు ఒక ఐఏఎస్ అని, ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చ రల్ సర్వీస్ అని చెప్పారు. ఇంతటి మహోన్నతమైన రైతులకు సహాయం చేసే వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చాలా అదృష్టవంతులని అన్నారు. ఆటల్లో ఒకరి నుంచి ఒకరు మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. స్టూడెంట్స్ ఎఫైర్స్ డీన్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం, క్రీడా స్ఫూర్తి అలవడుతాయన్నారు. యూనివర్సిటీ పరిధిలోని 13 కళాశాలలకు చెందిన 467 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా యూనివర్సిటీ అబ్జర్వర్ ఎస్. మధుసూదన్ రెడ్డి, అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్, డాక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
కబడ్డీ పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో ఈనెల 7 నుంచి నిర్వహిస్తున్న అండర్–17 బాలుర విభాగం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు రానున్నారని వివరించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ, సీబీఎస్‌ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్‌సీఈ, విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి కూడా జట్లు వస్తాయని వెల్లడించారు. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, అతిథులకు వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పనకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


