ప్రతీ ఇంటిని గ్రంథాలయంగా మార్చండి
ఇల్లెందు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా మార్చేందుకు ప్రతీ ఇంటిని గ్రంథాలయంగా మార్చాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని మాంటిస్సోరి స్కూల్ 33వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పారు. పిల్లల ఉన్నతిలో తల్లిదండ్రులు కూడా తమ పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాంటిస్సోరీ స్కూల్ చైర్మన్ జోష్ నెడుంతుండమ్, దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎంఈఓ ఉమాశంకర్, సుధాకర్ రెడ్డి, శివప్రసాద్, టి. ప్రసాద్, డాక్టర్ టి.సుధాకర్, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళా
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
●రూ.15లక్షలకు పైగా విలువైన
బంగారం, నగదు అపహరణ
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం కోయచలకలో శుక్రవారం ఉదయం చోరీజరిగింది. మహిళా కానిస్టేబుల్ విధులకు వెళ్తుండగా ఆమెను బస్సు ఎక్కించేందుకు భర్త కూడా వెళ్లగా తిరిగొచ్చే సరికి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు ను చోరీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ తెలబోయిన పూజిత ఇల్లెందులో విధులు నిర్వర్తిస్తుండగా శుక్రవారం ఉదయం ఆమెను కోయచలక క్రాస్ వద్ద దింపడానికి భర్త రాంబాబు వెళ్లాడు. బస్సు ఎక్కించాక పొలం పనులు చూసుకుని రాంబాబు వచ్చేసరికి ఇంటి వెనక తలుపు పగలగొట్టి ఉంది. లోపల పరిశీలించగా బీరువాలోని 13 తులా ల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అయితే, పూజిత దంపతులు బయటకు వెళ్తున్నట్లు గుర్తించి కాపుకాసిన నిందితులు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న రఘునాథపాలెం, సీసీఎస్ సీఐలు ఉస్మాన్ షరీఫ్, రాజు, ఎస్‌ఐ వి.శ్రీనివాస్ క్లూస్స్ టీంతో చేరుకుని విచారణ చేపట్టారు.
సమాజ సేవ అందరి బాధ్యత
రఘునాథపాలెం/చింతకాని/తిరుమలాయపాలెం: సమాజ సేవను అందరూ బాధ్యతగా భావించాలని, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఇందులో కీలకంగా వ్యవహరించాలని కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్‌సీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సూచించారు. రఘునాథపాలెం మండలం రేగులచలకలో ఎంజేపీటీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శీతాకాల శిబిరం శుక్రవారం ముగియగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు, ఆర్‌సీఓ సీ.హెచ్.రాంబాబు, సర్పంచ్ యండపల్లి రమాదేవి సత్యం, అధ్యాపకులు డాక్టర్ ఎన్.స్వాతి, సునీత, వినీల, అనిత, హుస్సేనితో పాటు నున్నా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, చింతకాని మండలం తిరుమలాపురంలో నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యాన, తిరుమలాయపాలెంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యూనిట్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శీతాకాల శిబిరాలను నారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌లో చేరడం ద్వారా విద్యార్థులకు సమాజ సేవ, సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. ఈకార్యక్రమాల్లో డీఐఈఓ రవిబాబు, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా పీఓ డాక్టర్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు మల్లయ్య, చాపలమడుగు వీరబాబు, నాగమణి పాల్గొన్నారు.


