రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రోడ్డు భద్రతను అందరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లు, ప్లెక్సీలను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్‌లు పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రతా సందేశాలతో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటరమణ, ఆర్టీఏ అధికారి జోషి, ఎంవీఐలు మనోహర్, వెంకట పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గరిమెళ్లపాడు నర్సరీ సందర్శన
గరిమెళ్లపాడు నర్సరీని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం సందర్శించారు. 72 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ నర్సరీ అణువణువూ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నర్సరీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.


